AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగురాష్ట్రాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Heavy Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!
Heavy Rain
Balaraju Goud
|

Updated on: Jul 20, 2024 | 8:04 AM

Share

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగురాష్ట్రాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 5.8 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతోంది. ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం, ఇవాళ వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత క్రమంగా బలహీనపడనున్న వాయుగుండం

ఏపీలో రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. పన్నెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఒడిశావైపు వస్తోంది. అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యారు. వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన జారీ చేశారు వాతావరణ అధికారులు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది రాష్ట్ర సర్కార్. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నవాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అటు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. — రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉండగా.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉదయం 10 తర్వాత వర్షం మరింత పెరుగుతుంది. హైదరాబాద్‌లోనూ మళ్లీ వర్షం మొదలవుతుంది. మధ్యాహ్నం 3వరకూ అలాగే కురుస్తాయి. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో భారీ వర్షం పడే అవకాశముంది. రాత్రి 9 తర్వాత ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షం కురుసే ఛాన్స్‌ అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే చిరుజల్లులు పడుతున్నాయి.

హైదరాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, ఏం.మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అటు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాలలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగం ఈదురు గాలులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..