Godavari Floods: వరదల ఎఫెక్ట్! చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న మంచి నీళ్లు..వీడియోలు వైరల్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం చింతలమెరకలో దాకే జనార్ధనరావు అనే వ్యక్తి ఇంట్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
Godavari Floods: తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో గోదావరి లంక ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముందస్తు సహాయ చర్యలు చేపట్టిన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే.. గోదావరి సమీప ప్రాంతాల్లో తక్కువ లోతులోనే చేతి బోర్లకు నీళ్లు అందుతాయి. అయితే గోదావరికి వరద భారీగా చేరడంతో.. కొన్ని గ్రామాల్లోని బోర్లలో నీళ్లు ఉప్పొంగుతున్నాయి. చేతి పంపులు కొడితేనే నీళ్లు వస్తాయి.. కానీ, ఎవరూ కొట్టకుండానే హ్యాండ్ పంపుల నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం చింతలమెరకలో దాకే జనార్ధనరావు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న బోరు నుంచి నీళ్లు ఇలానే ఉబికి వస్తున్నాయి.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడి సమీపంలో చేతి పంపును ఎవరూ కొట్టకుండా వాటంత అవే మంచి నీరు ఉబికి వచ్చింది. వరదల కారణంగా భూగర్భ జలాలు విస్తారంగా పెరగటంతో ఇలా నీరు పైకి వస్తుందని స్థానికులు అంటున్నారు. అలాగే గోదావరి తీరాన వున్న యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో కూడా ఇదే సీన్ కనిపించింది. ఇక్కడ రెండు, మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు.
ఇకపోతే, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వరదలకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్ నెట్‌లో చేరాయి. వాటిల్లో ప్రస్తుతం ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఇలా నీళ్లు వస్తాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి