Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. పోలవరం నిర్మాణానికి మరో రూ.2 వేల 800 కోట్లు విడుదల

ఎన్‌డీ‌ఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు చకచకా వచ్చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే కేంద్రం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. పోలవరం నిర్మాణానికి మరో రూ.2 వేల 800 కోట్లు విడుదల
Polavaram Project
Follow us
Eswar Chennupalli

| Edited By: Balaraju Goud

Updated on: Oct 08, 2024 | 11:17 AM

ఎన్‌డీ‌ఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు చకచకా వచ్చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే కేంద్రం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పోలవరం నిర్మాణానికి సంబంధించి 2,800 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో రూ.800 కోట్లు పాత బకాయిల కింద, 2000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కింద చెల్లించినట్లు అధికారుల వివరణ ఇచ్చారు.

నెల క్రితం 30,436 కోట్ల రూపాయల రెండో డీ‌పీఆర్‌ను ఆమోదించింది కేంద్ర కేబినెట్. ఆ మేరకు రూ. 2,800 కోట్ల ను తాజాగా విడుదల చేసింది. దీంతో హర్షం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి డీ పీ ఆర్ కంటే రూ. 12,157 కోట్ల అదనంగా రెండో డీ పీ ఆర్ ఆమోదం పొందడంతో ఆ నిధులను రెండేళ్లలో ఇవ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్ లో పేర్కొంది. ఆ మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6వేల కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 6,157 కోట్లు ఇస్తామన్న కేంద్రం, తాజాగా రూ. 2,800 కోట్లను విడుదల చేసింది.

రెండో డీపీయర్ రూ.30,436 కోట్లకు ఆమోదం

పోలవరం నిర్మాణం దశాబ్దాల కల. దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటినుంచి ఈ డిమాండ్ ఉన్నా 2004 తర్వాత దానిపై ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. మొదట్లో దాని నిర్మాణ అంచనా రూ.10 వేల కోట్ల నుంచి ఏళ్లు గడిచే కొద్దీ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి డీ పీ ఆర్ ను ప్రధాని మోదీ 1.0 ప్రభుత్వం రూ. 18,279 కోట్లకు ఆమోదం తెలిపింది. అయితే భూ సేకరణ, నిర్వాసితుల పునర్నిర్మాణ వ్యవహారాలు భారీగా పెరగడంతో ఒకానొక దశలో దాని వ్యయం రూ. 30, 436 కోట్లుగా అంచనా వేసి రెండో డీ పీ ఆర్ ను పంపారు. దాన్ని మోదీ 3.0 ప్రభుత్వం నెల కిందట ఆమోదించి బ్యాలెన్స్ అమౌంట్ రూ. 12,157 కోట్లను రెండేళ్లలో ఇస్తామని బడ్జెట్ లో పేర్కొంది. ఆ మేరకు తాజాగా రూ. 2,800 కోట్లు విడుదల చేసింది.

ప్రస్తుత అంచనా రూ. 60 వేల కోట్లు

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణకు చెల్లించాల్సిన బకాయిలు, నిర్వాసితుల పునర్నిర్మాణం ఖర్చు ఏటికేడు భారీగానే పెరుగుతూ ఉంది. మొదట్లో రూ. 18,257 కోట్లు, రెండో డీ పీ ఆర్ తయారు చేసింది 2018 లో అయితే అప్పుడు దాని అంచనా వ్యయం రూ. 30,436 కోట్లు. తర్వాత మళ్ళీ ఐదేళ్లు పూర్తి కావడం తో తాజాగా అది రూ. 60 వేల కోట్ల వరకు చేరి ఉంటుందని అంచనా. అయితే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో మొదట భూ సేకరణ చెల్లింపు అంశం పై కేంద్రం కొంత ఆలోచించినా తాజాగా రాష్ట్రం, కేంద్రం లోనూ ఎన్ డీ ఏ నే ఉండడం తో మూడో డీ పీ ఆర్ ను కూడా త్వరలోనే కేంద్రానికి పంపి ఆమోదింపచేసుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ప్రాజెక్టు సందర్శకుల ఖర్చు రూ. 23 కోట్లు విడుదల

గత తెలుగుదేశం ప్రభుత్వం 2018-19 మధ్య పోలవరం నిర్మాణాన్ని సందర్శించే సామాన్య జనానికి ఉచిత బస్ లు, అక్కడ భోజన సదుపాయం కల్పించింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ నిధులను ఇవ్వకపోవడం తో కాంట్రాక్టర్ హైకోర్టు కు వెళ్లడంతో 12 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రూ. 23 కోట్లను ఆ బకాయిల కింద విడుదల చేసింది ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..