Godavari Floods: ధవళేశ్వరం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద నీరు.. 36 ఏళ్ల రికార్డును చేరిపేస్తూ గోదావరి ఉగ్రరూపం
Godavari Floods: ఇక తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. నీటిమట్టం 17.30 అడుగులకు చేరింది. దీంతో 18 లక్షల 46వేల 678క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల..

Godavari Floods: ఇక తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. నీటిమట్టం 17.30 అడుగులకు చేరింది. దీంతో 18 లక్షల 46వేల 678క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పి. గన్నవరంలో పాత గోదావరి బ్రిడ్జి దగ్గరకు చేరింది వరదనీరు. 1986లో పరిస్థితి రిపీటైంది. పంట పొలాలు నీటమునిగాయి. మరో అర అడుగు నీరు చేరితే బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయే ప్రమాదముంది. భారీ వరదలకు చిగురుటాకులా వణుకుతోంది కోనసీమ. వరద ఉధృతి పెరుగుతుండటంతో లంక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కోనసీమ జిల్లాలో3 వేలకు మందికి పైగా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇక కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లలంక అద్దంకి వారి లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల్లో కాయగూరలు, అరటి పంటలు గోదావరి వరదకు నీటి మునిగాయి. రైతులు పడవ సహాయంతో గట్టుకు చేర్చుకుంటున్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండల కేంద్రాన్ని వరద ముంచెత్తింది. చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఎటపాక మండలాలు పూర్తిగా జలమయమయ్యాయి. చింతూరు వద్ద 60 అడుగులకు చేరింది శబరి నీటిమట్టం. దీంతో మసీదు, కనకదుర్గమ్మ, ఆంజనేయ, సాయిబాబా ఆలయాలు వరదముంపుకు గురయ్యాయి.
కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద ఉధృతి మరింత పెరిగింది. అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలోకి వరదనీరు చేరింది. అప్పనపల్లి, పాశర్లపూడి సహా లంక గ్రామాలలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, రెవిన్యూ, ఇరిగేషన్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.




36 ఏళ్ల రికార్డును చేరిపేస్తూ గోదావరి ఉగ్రరూపం
36 ఏళ్ల తర్వాత: భద్రాచలం వద్ద 36ఏళ్ల రికార్డును చెరిపేస్తూ గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది. 1986, ఆగస్టు 16న వచ్చిన వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 75.6అడుగులకు చేరింది. ఇప్పటివరకు భద్రంగా ఉన్న ఈ రికార్డు తాజాగా బద్దలయ్యే అవకాశాలున్నాయి.ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 67 అడుగులు దాటింది. సాయంత్రానికి 73-75 అడుగులకు చేరుకోవచ్చన్న అంచనాలతో భద్రాద్రి వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి