AP Elections:దశాబ్ధాలుగా ఓటమి ఎరుగని నేతలు.. ఈసారి గెలుపు కోసం పోటీ..

| Edited By: Srikar T

Mar 30, 2024 | 4:55 PM

జనరల్ ఎలక్షన్స్ అంటేనే చిత్ర విచిత్రాల సమాహారంగా ఉంటుంది. అస్సలు ఏమాత్రం ఊహించని మలుపులు, ఆశించని పరిణామాలు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఆ కోవలోకి చెందిందే ఈ స్టోరీ కూడా. వాళ్ళిద్దరూ మొన్నటి వరకు సన్నిహితులు. రాజకీయంగా ఓటమి ఎరుగని నేతలు.

AP Elections:దశాబ్ధాలుగా ఓటమి ఎరుగని నేతలు.. ఈసారి గెలుపు కోసం పోటీ..
Ap Elections Bheemili
Follow us on

జనరల్ ఎలక్షన్స్ అంటేనే చిత్ర విచిత్రాల సమాహారంగా ఉంటుంది. అస్సలు ఏమాత్రం ఊహించని మలుపులు, ఆశించని పరిణామాలు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఆ కోవలోకి చెందిందే ఈ స్టోరీ కూడా. వాళ్ళిద్దరూ మొన్నటి వరకు సన్నిహితులు. రాజకీయంగా ఓటమి ఎరుగని నేతలు. ఒకరు ఏకంగా పోటీ చేసిన ఐదుసార్లు వరుసగా విజయం సాధిస్తే, మరొకరు రాజకీయాలకు వచ్చి పోటీ చేసిన మూడు ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యం ఉన్న నేత. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది. ఇందులో ఒకరు ఓటమి పాలవడం అనివార్యం. ఇంతకీ ఈ ఇద్దరిలో ఓటమి కోసం పోటీ చేసే నేత ఎవరు? ఇప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ చాలా ఆసక్తిగా ఉంది కదా రండి ఒకసారి చూసేద్దాం.

గంటా ఐదు సార్లు వరుస విజయాలు..

గంట శ్రీనివాసరావు.. రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైన నేత. ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వచ్చి వ్యాపార, రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న నాయకుడు. పోర్టులో కాంట్రాక్టర్‎గా ఉంటూ ఆ తర్వాత 1999 లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి అనకాపల్లి ఎంపీగా గెలుపొందిన నాయకులు. ఆయన తొలి విజయమే సంచలనం. త్రిముఖ పోటీలో ఉద్దండులపై విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసిన ప్రతిచోట మళ్లీ తిరిగి వరుస విజయాలు నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 2004లో చోడవరం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గంట శ్రీనివాస్, 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ టెన్యూర్, ఆ టర్మ్ చివరిలో రెండేళ్లపాటు ప్రజారాజ్యం విలీనం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మంత్రిగా ఉంటూనే కాంగ్రెస్‎కు రిజైన్ చేసి మళ్లీ తిరిగి తన మాతృ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఘర్ వాపసి అయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి బరిలోకి దిగి సుమారు 36 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఐదేళ్లపాటు మంత్రిగా సేవలందించారు. అనంతరం 2019లో మళ్లీ తన స్థానాన్ని విశాఖ నార్త్ నియోజకవర్గానికి మార్చుకుని అక్కడ 2000 ఓట్లతో విజయం సాధించారు. ఇలా వరుసగా తొలుత ఎంపీ ఆ తర్వాత పోటీ చేసిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ వచ్చిన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు 2024లో భీమిలి నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు.

మూడు పార్టీల నుంచి మూడు సార్లు అవంతి..

ఇక అవంతి శ్రీనివాస్ విషయానికొస్తే గంటకి సన్నిహితుడుగా ఉంటూ 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆ పార్టీ వ్యవహారాలన్ని చూస్తూ వచ్చిన గంట సహకారంతోనే అవంతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి సుమారు 7000 ఓట్ల మెజార్టీని సాధించారు. కృష్ణా జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ కూడా పోటీ చేసిన చోట నుంచి తిరిగి పోటీ చేయకుండా ఉండటమే కాకుండా పోటీ చేసిన పార్టీ నుంచి కూడా తిరిగి మళ్ళీ పోటీ చేయని నేపథ్యమే. అయినా విజయపరంపర కొనసాగిస్తూనే వస్తున్నారు. 2009లో భీమిలి నుంచి గెలిచిన తర్వాత ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్‎లో చేరిన అవంతి శ్రీనివాస్ 2014లో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి 42 వేల ఓట్ల మెజార్టీ సాధించి ఎంపి అయ్యారు. 2019 కి వచ్చేసరికి మళ్లీ తెలుగుదేశంకు రాజీనామా చేసి జగన్‎తో చేరి తిరిగి భీమిలి ఎమ్మెల్యేగానే కాంటెస్ట్ చేశారు. ఈసారి 9వేలకు పైగా మెజార్టీ వచ్చింది అవంతికి. మొదటి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఇలా అవంతి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వేర్వేరు పార్టీల నుంచి మూడుసార్లు పోటీ చేసినప్పటికీ మూడుసార్లు విజయం సాధించి తనకంటూ ఒక ముద్రనే వేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకరి ఓటమి అనివార్యం..

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి వీళ్ళిద్దరూ నేరుగా ఒకరికి ఒకరు తలపడనున్నారు. గంటాకు దోబూచులాడిన భీమిలి నియోజకవర్గమే చివరికి దక్కడంతో వీరిద్దరి మధ్య పోటీ అనివార్యమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా గంటా బరిలోకి దిగుతున్నారు దీంతో వీరిద్దరిలో ఒకరు ఓటమిపాలవడం అనివార్యం. ప్రస్తుతం ఎవరు ఓటమిపాలవుతారు ఎవరు గెలుస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

భీమిలిలో కాపు సామాజిక వర్గం ఎటువైపు?

ఒకసారి భీమిలి నియోజకవర్గాన్ని చూస్తే రాష్ట్రంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం భీమిలి. ఇందులో మెజారిటీ, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తూర్పు కాపులే. అయితే అవంతి, గంటా శ్రీనివాసరావు ఇద్దరు ఓసి కాపు సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ 2009, 19లలో అవంతి శ్రీనివాస్‎ను 2014లో ఘంటా శ్రీనివాస్‎ను అక్కున చేర్చుకున్నారు భీమిలి ప్రజలు. భీమిలి నియోజకవర్గంలో దాదాపు లక్ష‎కు పైగా ఓట్లు ఉండే కాపు సామాజిక వర్గ ప్రాధాన్యత ఎవరికి అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే కావడం, ఇద్దరు గతంలో తమకు ఎమ్మెల్యేలుగా పని చేసి ఉండడంతో ఎవరి పట్ల మొగ్గు చూపుతారు అన్న చర్చ జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తాను గ్రాస్ రూట్ లెవెల్‎లో తిరుగుతున్నానని, నిరంతరం ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నామని వాలంటీర్లు, గ్రామ సచివాలయం లాంటి ఏజెన్సీలతో నిరంతరం ప్రజలకు అవసరమైన కార్యక్రమాల రూపకల్పన, అమలుతో మరింత దగ్గరయ్యామని అవంతి చెబుతున్నారు.

అవతల కాండిడేట్ గంట అయినా ఇంకెవరైనా కూడా భయపడే ప్రసక్తే లేదంటున్నారు అవంతి. అందులోనూ గంట ఒకచోట పోటీ చేసి తిరిగి మళ్ళీ అక్కడే పోటీ చేస్తానని చెప్పే సాహసం లేదని ఎందుకంటే అక్కడ ప్రజలకు గంటా సామర్థ్యత అవకాశవాదం అర్థమవుతాయి కాబట్టి మళ్లీ పోటీ చేస్తే సహకరించరని నియోజకవర్గం మారుతారఎన్నారన్నారు. అయితే దీనికి గంట వర్గం కౌంటర్ ఇస్తోంది. 2014లో మంత్రిగా భీమిలి నియోజకవర్గంలో మంచి పేరు పొందిన గంటా.. ఎన్నికల కోసం ప్రత్యేకమైన ఎలక్షన్నీరింగ్ స్ట్రాటజీస్ ఉంటాయని, అవంతిపై భారీ మెజార్టీ సాధిస్తాం అంటుంది గంట వర్గం. ఈ నేపథ్యంలో ఓటమి ఎరుగని ఈ నేతల మధ్య పోరు ఓటమి వారికి ప్రజలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎలా ఉండబోతుంది అన్న అంశాలపై విస్తృత చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…