AP News: పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. అనుమానమొచ్చి చెక్ చేయగా

పోలీస్ నేమ్ బోర్డుతో ఓ వెహికల్ ఒడిశా నుంచి ఏపీలోకి ఎంటరైంది. మొదట ఆ వాహనంపై ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేయగా..

AP News: పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. అనుమానమొచ్చి చెక్ చేయగా
Representative Image
Follow us
G Koteswara Rao

| Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2024 | 12:57 PM

పోలీస్ నేమ్ బోర్డుతో ఒడిశా నుంచి ఏపిలోకి స్పీడ్‌గా దూసుకొస్తుంది ఓ బొలెరో వెహికల్. పోలీస్ వెహికల్ కదా ఏదో మేజర్ క్రైమ్ జరిగి ఉంటుందనుకొని ఎవరికి వాళ్లే చెక్ పోస్ట్స్ దగ్గర చెక్ చేయకుండా హడావుడిగా వదిలేశారు. అలా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పోలీస్ వెహికల్ విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని గ్రీన్ ఫిల్డ్ నేషనల్ హైవే మీద ఆగి ఉన్న ఓ బొగ్గు లారీ వద్దకు వచ్చి ఆగింది. ఆ పోలీస్ వెహికల్ ఆగిన కొద్దిసేపటికి మరో బొలెరో లగేజ్ గూడ్స్ వెహికల్ వచ్చింది. అలా వచ్చిన రెండు వాహనాల్లో నుంచి కొందరు వ్యక్తులు దిగి బొగ్గు లారీ వద్దకు వెళ్లారు. అక్కడున్న బొగ్గు లారీ డ్రైవర్, క్లీనర్‌ల సహాయంతో లారీలో ఉన్న బొగ్గును అన్ లోడ్ చేయడం ప్రారంభించారు. ఇదంతా చూస్తున్న స్థానికులు పోలీసులు ఏవో తనిఖీలు చేస్తున్నారు అని అనుకున్నారు. అలా కొంతసేపటికి లారీలో సగం బొగ్గు అన్ లోడ్ చేసి.. అక్కడే ఉన్న బొలెరో లగేజ్ వెహికల్‌లో ఉన్న పెద్ద పెద్ద మూటలు తీసి బొగ్గు మధ్యలో పెట్టి తిరిగి దించిన బొగ్గును లారీలో లోడ్ చేశారు.

అలా పని పూర్తి చేసుకొని బొగ్గు లోడ్‌తో లారీ అక్కడ నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి బయలుదేరిన లారీ కొట్టక్కి సమీపంలోకి వచ్చేసరికి పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ కనిపించారు. అందులో భాగంగా బొగ్గు లారీని కూడా తనిఖీ చేయగా లారీ అంతా బొగ్గుతో నిండి కనిపించింది. అంతవరకు బాగానే ఉన్నా బొగ్గు లారీని పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో లారీ డ్రైవర్, క్లీనర్ వ్యవహారశైలి కొంత అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో లారీని మరింత ముమ్మరంగా తనిఖీలు చేశారు పోలీసులు. అసలు విషయం బయటపడింది.

బొగ్గు మధ్యలోని పెద్ద పెద్ద మూటల్లో ఉన్న గంజాయి బయటపడింది. సుమారు యాబై లక్షల విలువైన ఎనిమిది వందల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెంటనే పోలీసులు లారీ డ్రైవర్, క్లీనర్‌లను తమదైన స్టైల్‌లో విచారించగా గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? లాంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి తరలించడానికి బొలెరో వాహనానికి పోలీస్ నేమ్ బోర్డు పెట్టుకొని.. వాహనాలకు నకిలీ నెంబర్ ప్లేట్లు తగిలించి.. స్మగ్లింగ్‌కి పాల్పడినట్లు తెలియజేశారు పోలీసులు. ఈ గంజాయి ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కి తరలిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో లారీకి గంజాయి అందజేసిన రెండు బొలెరో వాహనాలు స్వాధీనం చేసుకోగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..