Andhra Pradesh: ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన
ఉచిత విద్యుత్ పథకంపై ఏపీ మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకంపై చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు.
అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలు, 4,75,557 ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 19,92,855 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ను అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం నెలకు సుమారు రూ.477.30 కోట్లు వినియోగిస్తున్నట్లు మంత్రి ప్రకటనలో వెల్లడించారు.
అపోహలు ప్రచారం…
ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. అల్పాదాయ వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా అమలవుతున్న ఉచిత విద్యుత్ పధకానికి అడ్డంకులు సృష్టించేందుకే… కొందరు లేనిపోని అసత్యాలను, అపోహలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం అమలు చేస్తోన్న పలు పథకాలు, సూపర్ సిక్స్ వంటి వాటిని చూసి పూర్తి నిరాశలో మునిగి పోయిన వైసీపీ… తన నీలి మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాతలు రాయిస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతమంది అర్హులకైనా పథకం అమలు….
ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ వినియోగానికి 200 యూనిట్లు కటాఫ్ గా ఈ పథకం ఎంతో కాలంగా అమలు అవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. దళిత, గిరిజనులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మొదటిసారి అమలు చేసిందే తెలుగుదేశం పార్టీయే అని ఆయన తెలిపారు. 200 యూనిట్ల లోపు వచ్చిన అందరూ పథకానికి అర్హులే అని స్పష్టం చేశారు. పథకం అమలు విధివిధానాలకు సంబంధించి…. లబ్ధిదారుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే.. 1912కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. విద్యుత్ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టినా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పధకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..