AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అభం.. శుభం తెలియని భార్యా పిల్లలు ఏం చేశారు చారి.. ఎంతకు ఒడిగట్టావు..!

తెల్లారితే ఉగాది పండుగ.. కానీ ఆ ఇంట్లో తెల్లవారగానే విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. స్వర్ణకారుడు కృష్ణాచారి, భార్య సరళ, ఇద్దరు కుమారులతో ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.

Andhra Pradesh: అభం.. శుభం తెలియని భార్యా పిల్లలు ఏం చేశారు చారి.. ఎంతకు ఒడిగట్టావు..!
Madakasira Tragedy
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 30, 2025 | 6:09 PM

Share

తెల్లారితే ఉగాది పండుగ.. కానీ ఆ ఇంట్లో తెల్లవారగానే విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. స్వర్ణకారుడు కృష్ణాచారి, భార్య సరళ, ఇద్దరు కుమారులతో ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణానికి చెందిన కృష్ణాచారి స్వర్ణకారుడు. బంగారు ఆభరణాలు తయారు చేసే వృత్తి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పెద్ద కుమారుడు సంతోష్ హాస్టల్‌లో ఉంటూ, పదవ తరగతి పరీక్షలు రాసి పండుగకు ఇంటికి వచ్చాడు. రెండో కుమారుడు భువనేష్ కూడా పండుగని ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి పన్నెండు, ఒంటిగంట వరకు స్వర్ణకారుడు కృష్ణాచారి సోదరితో ఫోన్‌లో మాట్లాడాడు. ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు తెల్లారేసరికి కృష్ణాచారి కుటుంబం ఇంట్లో మిగతాజీవులుగా పడి ఉన్నారు. కృష్ణాచారి, భార్య సరళ, ఇద్దరు కుమారులు సంతోష్, భువనేష్ చనిపోయారు.

ఉగాది పండుగ సందర్భంగా కృష్ణాచారి తండ్రి మనవళ్లను ఇంటికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేస్తే ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వచ్చాడు. తలుపులు తీసే ఉన్నాయి. తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి చూసేసరికి కుటుంబం అంతా విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని పోవిచారణ చేపట్టారు. దీంతో కృష్ణాచారి బంగారం తయారు చేసేందుకు ఉపయోగించే సైనేడ్ నీటిలో కలిపుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాలుగు వాటర్ బాటిల్స్‌లో కుటుంబసభ్యులు నలుగురు తాగినట్లు.. అనంతరం కాసేపటికే చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కృష్ణాచారి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అటు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం సంఘటనా స్థలంలో ఉన్న మృతదేహాలు చల్లా చదురుగా పడి ఉండటాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణాచారి రెండు మొబైల్ ఫోన్లు పగిలిపోయి ఉండడంతో.. కృష్ణాచారి కుటుంబ సభ్యుల మృతిపై ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు జిల్లా ఎస్పీ రత్న. పిల్లలకు సైనేడ్ ఇచ్చి చంపి.. తర్వాత తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు.. పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా చారి సైనేడ్ ఎంత మోతాదులో తీసుకున్నాడు అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుందని అంటున్నారు పోలీసులు. ఉగాది పండుగ రోజు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..