AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

పలు కేసులు, ఆరోపణలతో సతమతమవుతున్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆ ఐదుగురు వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Nandigam Suresh
Balaraju Goud
|

Updated on: Sep 05, 2024 | 9:12 AM

Share

పలు కేసులు, ఆరోపణలతో సతమతమవుతున్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆ ఐదుగురు వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో సురేశ్‌ను అరెస్టు చేశారు పోలీసులు.

నాటకీయ పరిణామాల మధ్య సురేశ్‌ను ఏపీ పోలీసులు తెలంగాణలో అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌‌లోని మియాపూర్ గెస్ట్‌హౌజ్‌లో ఉన్నారన్న సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు. పక్కా సమాచారంతో అక్కడ ఆయన్ను అరెస్ట్‌ చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం మంగళగిరి తరలించారు.

వీడియో చూడండి.. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటుచేశారు. దాడి జరిగిన రోజు వైసీపీ కార్యాలయం వద్ద ఉన్న సిసి కెమెరా విజువల్స్ ఇవ్వాలంటూ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇదిలావుంటే, వైసీపీ నేతలను పాత కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గతంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసుతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు పలువురు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కేసుల్లో ఇప్పటికే కొందరు నేతలు పోలీసు విచారణ ఎదుర్కొంటుండగా.. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పు వారికి మరింత ఇబ్బందిగా మారాయి. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. ముందస్తు బెయిల్‌ కోసం వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో.. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ సహా.. 14మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా తమను అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో.. వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు 2 వారాల పాటు.. తమను అరెస్ట్‌ చేయవద్దని కోరారు వైసీపీ నేతలు. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వొద్దని.. టీడీపీ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. రెండు వర్గాల వాదనల తర్వాత.. మధ్యంతర ఉత్తర్వుల అభ్యర్థనను తిరస్కరించింది హైకోర్ట్. బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌ చేసిన తర్వాత.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీమంత్రి జోగి రమేష్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది హైకోర్ట్. ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదని తీర్పునిచ్చింది. దీంతో జోగి రమేష్‌తోపాటు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..