Pawan Kalyan: ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంచిపని చేశారు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్.. హైడ్రా ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్.. హైడ్రా ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిరక్షించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా అభినందనీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. చెరువులను కాపాడే విషయంలో రేవంత్ రెడ్డి మంచిపని చేశారన్నారు. అక్రమ నిర్మాణాలనేవి లేకుంటే ఇలాంటి విపత్తులు రావని పవన్ కల్యాణ్ అన్నారు.
హైడ్రా పెట్టి రేవంత్ మంచి పనిచేశారని.. అసలు అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. అక్రమార్కులపై చర్యల కోసం హైడ్రా లాంటివి కచ్చితంగా ఉండాలన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలన్నారు. మరో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా కట్టకుండా.. బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని.. అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు పవన్.. ఇక, ఇళ్ల నిర్మాణాలు చేసే సమయంలో.. వెంచర్లు వేసే సమయంలో.. వీటిని అడ్డుకోవాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే కట్టిన నిర్మాణాలకు పరిహారం ఇచ్చి కూల్చివేయాలని.. మానవతా కోణంలో ఆలోచించాలని పవన్ సూచించారు.
మరోవైపు బుడమేరులో జరిగిన ఆక్రమణలే విపత్తుకు కారణమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయపడ్డారు. విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా పనిచేస్తున్నారని.. ఈ వయసులోనూ ఆయన ట్రాక్టర్లు, జేసీబీలలో పర్యటిస్తున్నారని అన్నారు.
అలాంటి వారిని అభినందించాల్సి పోయి.. విమర్శించడం తగదని వైసీపీకి హితవు పలికారు. ఆరోపణలు చేసే ముందు వైసీపీ నేతలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..