Vijayawada: మరో అల్పపీడన హెచ్చరిక… సింగ్ నగర్ వదలి వెళ్తోన్న వరద బాధితులు..
సింగ్‌నగర్‌కు మళ్లీ ప్రమాదం పొంచి ఉందా?. బుడమేరు కట్టకు మళ్లీ గండి పడనుందా?. ఇదే భయంతో వణికిపోతున్నారు వరద బాధితులు. కట్టుబట్టలతో ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
విజయవాడ.. ఇంకా వరద, బురదలోనే ఉంది. చాలా కాలనీల్లో వరద నీళ్లతో నరకం చూస్తున్నారు ప్రజలు. వరదలతో భారీగా ముంపునకు గురైన.. సింగ్‌నగర్ చుట్టుపక్కల ప్రజలు, ప్రస్తుతం వరద తగ్గడంతో.. ఇళ్లను ఖాళీ చేసి బయటకు వస్తున్నారు. పవర్ లేకపోడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం, వాతావరణశాఖ ఏపీకి మళ్లీ వర్ష సూచన చేయడంతో.. కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు.
మరోసారి బుడమేరు పొంగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సింగ్‌నగర్ ప్రజలు. 4 రోజులుగా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విష జ్వరాలు ప్రబలుతాయన్న భయంతో ఖాళీ చేసి వెళ్తున్నామంటున్నారు వరద బాధితులు. వరదలతో సర్వం కోల్పోయామంటున్నారు సింగ్ నగర్ ప్రజలు. ఉద్యోగాలతో పాటు.. ఆస్తిపత్రాలు, పిల్లల చదువులు అన్నీ ఆగమయ్యాయని చెప్తున్నారు.
ఆదివారం నుంచి ముంపు ప్రాంతాల్లోనే సీఎం
వరద సాయం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఏపీ ప్రభుత్వం. ఆదివారం నుంచి విజయవాడ ముంపు ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. బుధవారం కూడా అధికారులతో సమీక్షలు, బాధితులకు అందుతున్న వరద సాయంపై ఆరా తీస్తున్నారు. వరద ప్రాంతాలకు నేరుగా వెళ్తూ సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బురద తొలగింపు పనులు మొదలుపెట్టించారు. వరద తరువాత రోగాల విజృంభనకు అవకాశం ఉండడంతో.. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించారు సీఎం చంద్రబాబు. గర్భిణీలు, తీవ్ర జబ్బులు ఉన్న వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మొత్తం 2100 మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపారు. వందకు పైగా ఫైర్ ఇంజన్లతో బురదను తీసేసే కార్యక్రమం చేయిస్తున్నారు. వీటితో పాటు ప్రొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా బురద, చెత్తను తీసేయిస్తున్నారు.
మరోవైపు.. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం నాడు 9 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు అందించిన ప్రభుత్వం.. బుధవారం నాడు మరో ఆరు లక్షల ఆహార ప్యాకెట్లు వరద బాధితులకు అందించారు. వీటితో పాటు ఎనిమిదిన్నర లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. అదే సమయంలో.. ప్రైవేట్ బోటు ఆపరేటర్లు డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. బాధితుల తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..