AP News: సీఎంను కలిసిన అనిల్.. నెల్లూరులో రాజకీయ పరిస్థితులపై వివరణ
గత కొద్ది రోజులుగా నెల్లూరు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి అనిల్ కుమార్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ మధ్య వర్గపోరు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వైసీపీ నేతల మధ్య పంచాయితీ తాడేపల్లికి చేరింది. మరి అనిల్ కుమార్‌తో సీఎం జగన్ ఏం మాట్లాడారు..? సమస్య సాల్వ్ అయినట్లేనా..?

కొంతకాలం పార్టీకి దూరంగా ఉండి… ఇటీవలే మళ్లీ ఆక్టివ్ అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవల ఆనం రామనారాయణరెడ్డితో అనిత్ కుమార్‌కు మాటల యుద్ధం జరుగుతుండడం, టీడీపీ నేత నారా లోకేశ్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుండడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ ఈ సమావేశం జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితులపై జగన్ చర్చించారు. నెల్లూరు సిటీ పార్టీలో విభేదాలు తలెత్తడం వంటి అంశాలపై జగన్‌కు అనిల్ వివరించారు.
అనిల్ కుమార్ యాదవ్‌కు నెల్లూరు సిటీలో రాజకీయం కలిసిరావడం లేదు. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత కనిపిస్తుంది. నెల్లూరు సిటీ నుంచి ఈ సారి అనిల్‌కు సీటు లేదంటూ ఐటీవల బాగా ప్రచారం జరిగింది. ఇక అనిల్‌ని టార్గెట్ చేసుకుని నారా లోకేష్, ఆనం రామ్ నారాయణ రెడ్డి..ఇతర టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. వాటికి అనిల్ ఒక్కరే కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. ఇక సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో ఉన్న విభేదాలు కాస్తా పార్టీలో ఇబ్బందిగా మారాయి. దీంతో ఇరువురు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న అనిల్ కుమార్ నాలుగు రోజుల క్రితమే మౌనం వీడి మీడియా ముందుకు వచ్చారు. జిల్లా రాజకీయాల్లో తాను ఎదుర్కొంటోన్న ఇబ్బందులన్నింటినీ అనిల్‌కు కుమార్.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తనను ఇబ్బంది పెడుతున్న నాయకుల వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు సమాచారం.
అనిల్‌తో జిల్లా రాజకీయాలపై చర్చించిన జగన్… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పటిష్టంగా ఉందని.. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక తన నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు డెవలప్‌మెంట్ పనులకు నిధులు ఇవ్వాల్సిందిగా అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఎమ్మెల్యే రిక్వెస్టులపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. నిధుల మంజూరు చేయాలని వెంటనే అధికారును ఆదేశించారట. ఈ భేటీతో కొంతకాలంగా నెలకొన్న విభేదాలు, అనుమానాలకు ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు పార్టీ నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..