Neeraja Reddy: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా..
ఏపీలోని కర్నూలులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు నీరజారెడ్డి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీరజా రెడ్డి మరణించారు.
ఏపీలోని కర్నూలులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు నీరజారెడ్డి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీరజా రెడ్డి మరణించారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీచుపల్లిలో కారు వెనుక టైర్ పేలిపోవడంతో.. రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలిపోవడంతో ఫార్చునర్ కారు పల్టీ కొట్టింది. ప్రమాదం ధాటికి వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో నీరజారెడ్డి తల, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే నీరజ రెడ్డిని కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని పేర్కొంటున్నారు.
నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉండి.. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం ఆమె అధికార పార్టీని వీడి బీజేపీలో చేరారు.
ప్రస్తుతం నీరజారెడ్డి ఆలూరు బీజేపీ ఇన్చార్జిగా ఉన్నారు. గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేసిన నీరజారెడ్డి భర్త పాటిల్ శేసిరెడ్డి ఫ్యాక్షన్ కారణంగా మరణించారు. ఇప్పుడు శేసిరెడ్డి భార్య నీరజారెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో తీవ్ర విషాదం అలుముకుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..