AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం.. సరదా కోసం వెళితే ప్రాణాలే పోయాయ్..

Andhra Pradesh: కృష్ణానది.. మిట్టమద్యాహ్నం 12 గంటల సమయం.. నది మధ్యలో ఓ పిల్లాడు ఆర్తనాదాలు చేస్తున్నాడు.. ఎవరైనా ఉంటే రండి.. కాపాడండి.. కాపాడండి.. అంటూ కేకలు వేశాడు. అక్కడే ఉన్న మత్స్యకారులు..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం.. సరదా కోసం వెళితే ప్రాణాలే పోయాయ్..
Drown
Shiva Prajapati
|

Updated on: Dec 16, 2022 | 10:33 PM

Share

కృష్ణానది.. మిట్టమద్యాహ్నం 12 గంటల సమయం.. నది మధ్యలో ఓ పిల్లాడు ఆర్తనాదాలు చేస్తున్నాడు.. ఎవరైనా ఉంటే రండి.. కాపాడండి.. కాపాడండి.. అంటూ కేకలు వేశాడు. అక్కడే ఉన్న మత్స్యకారులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది. ఏకంగా ఐదుగురు విద్యార్ధులు నదిలో గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది.

మొత్తం ఏడుగురు విద్యార్ధులు సరదాగా కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. నదీ ప్రవాహం తక్కువగానే ఉంది కదా.. లోతు కూడా తక్కువే ఉండొచ్చులే అనుకుని లోపలికి దిగారు. కానీ అక్కడే ఊబి రూపంలో ప్రమాదం పొంచి ఉందని వాళ్లు గమనించలేకపోయారు. బాలు, బాజీ, హుస్సేన్, కామేష్, మున్నా, ఖాసీం, శ్రీను అనే ఏడుగురు విద్యార్ధులు ఈత కోసం వెళ్లారు. ఏడుగురిలో ఆరుగురు నదిలోకి దిగి నీటిలో కేరింతలు కొడుతున్నారు. వాళ్లలో హుస్సేన్ అనే పిల్లాడు ఊబిలోకి జారిపోయాడు. హుస్సేన్‌ను కాపాడే ప్రయత్నంలో మిగతా వాళ్లు కూడా ఊబిలోకి కూరుకుపోయారు.

నదిలోకి దిగకుండా ఒడ్డున కూర్చున్న శ్రీను, తోటి స్నేహితులు లోపలకు మునిగిపోయి హాహాకారాలు చేస్తుండడంతో.. పరుగున వెళ్లి దగ్గరలో ఉన్న జాలర్లకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు వచ్చే లోపే ఐదుగురు మునిగిపోయారు. చిన్నగట్టు మీద నిలబడి అరుస్తున్న ఖాసీంను వెంటనే రక్షించారు మత్స్యకారులు. గల్లంతైన వారిలో మున్నా, కామేష్ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.

ఇవి కూడా చదవండి

బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లలు ఇక్కడే ఎక్కడో ఉంటారు.. వెతికిపెట్టండి అంటూ ధీనంగా వేడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్‌ నిలిపివేశారు. శనివారం ఉదయం గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. గల్లంతైన మిగిలిన ముగ్గురు ఎక్కడ ఉన్నారు.. ప్రాణాలతోనే ఉన్నారా.. లేదా అనేది అర్ధం కాని పరిస్థితి.. కానీ క్షేమంగా తిరిగిరావాలని ఆ కుటుంబసభ్యులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..