Paritala Ravi Murder Case: 18 యేళ్ల తర్వాత.. జైలు నుంచి విడుదలైన పరిటాల రవి హత్య కేసు నిందితులు
18 యేళ్ల క్రితం టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నాటి కేసులో నిందితులుగా తేలిన వారికి కోర్టు జైలు శిక్ష విధించగా.. వారంతా కడప సెంట్రల్ జైలులో నాటి నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారిలో ఐదుగురు నిందితులు శుక్రవారం (డిసెంబర్ 20) జైలు నుంచి విడుదలయ్యారు..
అమరావతి, డిసెంబర్ 20: మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్యకేసులో నిందితులు శుక్రవారం (డిసెంబర్ 20) జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడగా.. 18 ఏళ్లుగా కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నిందితులు ఇటీవల హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకోగా.. దీనిని విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో నిందితులైన A3 పండు నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.
వీరంతా ప్రతి సోమవారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.25వేల రెండు పూచీకత్తులు ఇవ్వాలని, జైలు నుంచి విడుదలయ్యాక సత్ప్రవర్తన సరిగా లేకపోతే వచ్చే ఫిర్యాదు మేరకు బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. కాగా పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. నంతపురం జిల్లా పెనుగొండ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా అతడిపై దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటనలో రవి తలపై బుల్లెట్ తగలడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రవితోపాటు ఆయన గన్‌మెన్, అనుచరులు కూడా మృతి చెందారు. పరిటాల రవి మరణాంతరం ఆయన సతీమణి పరిటీల సునీత రాజకీయాల్లో వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా.
ఈ కేసులో18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన నిందితులను ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించడంతో నిబంధనల మేరకు హైకోర్టు నేడు ఐదుగురు నిందితులను జైలు నుంచి విడుదల చేసింది.