Kommu Konam Fish: అమ్మో.. కొమ్ముకోనాం – తేడా వస్తే తీస్తుంది ప్రాణం..
ఆ ఫిష్ జోలికి పోతే ఫినిష్ అయిపోతారా? అది మనుషులను తన కొమ్ముతో పొడిచి చంపేస్తుందా? సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిపోయేంత బలం ఆ రాకాసి చేపకు ఉంటుందా? కొమ్ము కోనాం చేప లాగెయ్యడంతో మత్స్యకారుడు ఎర్రయ్య గల్లంతయ్యాడు.అయినా సరే.. ప్రాణాలకు తెగించి కొమ్ము కోనాం చేపను ఎందుకు వేటాడుతున్నారు మత్స్యకారులు? ఇంతకీ ఆ చేప ఎందుకంత డేంజర్?

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్య్సకారుడు….భారీ చేపను చేజిక్కించుకునే యత్నంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడి గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక నుంచి నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వేట సాగిస్తుండగా గేలానికి సుమారు 200 కిలోల బరువుండే కొమ్ము కోనాం చేప చిక్కింది. చేపను ఒడ్డుకు లాగే ప్రయత్నం చేయడంతో.. బలంగా వెనక్కు లాగింది చేప. ఈ క్రమంలో తాడుతో సహా సముద్రంలో పడిపోయాడు మత్య్సకారుడు ఎర్రయ్య. ఎర్రయ్యను కొమ్ముకోనాం చేప సముద్రంలోకి లాక్కెళ్లింది.
వెంటనే అప్రమత్తమైన మిగతా ముగ్గురు మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. ఎర్రయ్య కోసం గాలిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. సముద్రంలో 25 నాటికల్ మైళ్ల దూరం వెళ్లి వేట చేస్తున్నప్పుడు పెద్ద కొమ్ముకోనాం చేప వలకు చిక్కింది. దీన్ని బోటులోకి లాగే క్రమంలో ఎర్రయ్య కాలికి తాడు చిక్కుకుపోయింది. అదే సమయంలో చేప బలంగా లాగడంతో ఎర్రయ్య సముద్రంలో పడి గల్లంతయ్యాడు. మిగిలిన మత్స్యకారులు అతడి కోసం గాలించినా లాభం లేకపోయింది.
గతంలో ఓ మత్స్యకారుడి ప్రాణాలను బలిగొంది కొమ్ము కోనాం చేప. 2022, ఫిబ్రవరి 3న, వలలో పడ్డ కొమ్ము కోనాం చేపలను బోటులోకి లాగుతుండగా జోగన్న అనే మత్స్యకారుడి పొట్టలో దాని కొమ్ము గుచ్చుకోవడంతో, తీవ్ర రక్తస్రావమై అతడు చనిపోయాడు. ఈ కొమ్ము కోనాం చేపలు ఇంత ప్రమాదకరమైనవని తెలిసినా, వాటిని మత్స్యకారులు ఎందుకు వేటాడుతున్నారు? ఈ డేంజరస్ ఫిష్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం.
ఖడ్గం లాంటి పదునైన కొమ్ము ఉండే చేప –కొమ్ముకోనాం. మన దగ్గర లభించే కొమ్ముకోనాం చేపలు 250 కేజీల వరకు బరువు, 16 అడుగుల దాకా పొడవు పెరుగుతాయి. సముద్రంలో 25 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చాడుతూ ఉంటాయి. జులై-సెప్టెంబర్ మధ్యకాలంలో వీటి ఉనికి ఎక్కువగా ఉంటుంది. వీటినే మార్లిన్ ఫిష్ అని కూడా అంటారు. కొమ్ముకోనాం చేపలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రాణాలకు తెగించి కొమ్ముకోనాం చేపలను వేటాడతారు మత్స్యకారులు
కొమ్ముకోనాం చేపలు చాలా చురుగ్గా ఉంటాయి. మిగతా చేపల కంటే దాని తల భాగం భిన్నంగా ఉంటుంది. దాని తలకు ఇనుప చువ్వ లాంటి కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ముతోనే ఇతర చేపలను వేటాడుతుంది. అలాగే ఆత్మరక్షణ చేసుకుంటుంది. ఈ చేపలను వేటాడేటప్పుడు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆంధ్రా యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ మంజులత. మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు. దిగువన వీడియోలో చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.