AP Fire Accident: తిరుపతి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లోనే వైద్యుడి సజీవ దహనం.. ఇద్దరు పిల్లలు కూడా..
తిరుపతి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంటలోని ఓ భవనంలో ఈ తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో ఓ వైద్యుడు మంటల్లో సజీవ దహనం కాగా.. వారి పిల్లలు ఇద్దరూ ఆసుపత్రిలో..
AP Fire Accident: తిరుపతి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంటలోని ఓ భవనంలో ఈ తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో ఓ వైద్యుడు మంటల్లో సజీవ దహనం కాగా.. వారి పిల్లలు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స చెందుతూ ప్రాణాలు విడిచారు. జమ్మలమడుగుకు చెందిన రవిశంకర్ రెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన కుటుంబ తిరుపతి జిల్లా రేణిగుంటలో స్థిరపడ్డారు. ఆయన రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. హాస్పటల్ నిర్వహిస్తున్న భవనంలోని పై అంతస్తులోనే వైద్యుడి కుటుంబం నివాసం ఉంటుంది. సెప్టెంబర్ 25వ తేదీ ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో వైద్యుడు రవిశంకర్ రెడ్డి సజీవదహనం అయ్యారు. తీవ్రంగా గాయాలైన వారి పిల్లలను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. దీంతో రేణిగుంటలో విషాదం అలముకుంది. వైద్యుడు రవిశంకర్ రెడ్డి నివాసం ఉంటున్న భవనంలో మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోపు రవిశంకర్ రెడ్డి భార్య అనంతలక్ష్మి, తల్లి రామ సుబ్బమ్మను కాపాడారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత అతికష్టం మీద వైద్యుడి కుమారుడు భరత్ (12), కుమార్తె కార్తీక (15)లను పై అంతస్తు నుంచి కిందికి దించారు. వాళ్లిద్దరూ తీవ్రగాయాలతో అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స కోసం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు ఇద్దరూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ రవిశంకర్ రెడ్డి DBR సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిలోనూ రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..