Andhra News: ఫార్మా కంపెనీకి చెందిన రన్నింగ్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
అనకాపల్లి జిల్లాలో ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీ బస్సు దగ్దమైంది. పరవాడ ఫార్మసిటీలో ఉన్న లారెన్స్ ఫార్మాకు చెందిన బస్సు ఉద్యోగులను పికప్ చేసుకునేందుకు చోడవరం వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించి బస్సును పక్కకు ఆపిన డ్రైవర్ ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అది ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీ బస్సు.. నిత్యం పదుల సంఖ్యలో ఉద్యోగులను రవాణా చేస్తుంది. ప్రతిరోజు మాదిరిగానే ఆ బస్సు ఉద్యోగులను పికప్ చేసుకునేందుకు బయలుదేరింది. రోడ్డుపై వెళ్తుంది. క్లీనర్‌తో మాట్లాడుకుంటూ డ్రైవర్ బస్సును డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో వెనుక నుంచి ఏదో అరుపులు వినిపించాయి. ఆపి చూసేసరికి ఇంకేముంది దట్టంగా పొగలు, మంటలు. వివరాళ్లోకి వెళితే…అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మసిటీలో లారెన్స్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ ఫార్మా కంపెనీలో వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ ఉద్యోగం చేసే వారు కంపెనీకి చెందిన బస్సులోనే రాకపోకలు సాగిస్తుంటారు. కంపెనీకి బస్సే ఉద్యోగులను రోజు పికప్, డ్రాపింగ్ చేస్తుంది.
రోజు మాదిరిగానే లారెన్స్ ఫార్మాకు చెందిన ఓ బస్సు కంపెనీ నుంచి ఉద్యోగులను పికప్ చేసుకునేందుకు పరవాడ నుంచి చోడవరం బయల్దేరింది. బస్సు అనకాపల్లి మండలం బవులవాడ వద్దకు వచ్చేసరికి.. బస్సు డీజిల్ ట్యాంకర్ నుంచి దట్టంగా పొగ, మంటలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించని డ్రైవర్ బస్సును డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అయితే బస్సులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో వెనక్కి తిరిగి చూసిన డ్రైవర్ మంటలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే బస్సును పక్కకు ఆపి క్లీనర్‌తో పాటు కిందకు దిగాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.
వీడియో చూడండి…
బస్సులో చెలరేగిన మంటలు అంతకంతకూ బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయినా అప్పటికే బస్సు మొత్తం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో డైవర్ క్లీనర్ మాత్రమే ఉన్నారు. స్థానికులు కేకలు వేయడంతో సమయానికి బస్సును ఆపి వారు కిందకు దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..