Krishna District: గోల్డ్ నెక్లెస్ సెలెక్ట్ చేసి ఆస్పత్రికి తెమ్మన్న గవర్నమెంట్ డాక్టర్.. షాపు ఓనర్ ఆ పని చేయగా

డాక్టరంటే నాలుగైదేళ్లు కష్టపడి ఎంబీబీఎస్ చెయ్యక్కర్లేదు.. ఒంటిమీద తెల్ల కోటు... మెళ్లో స్టెతస్కోపు... క్లాస్‌గా ఓ కళ్లజోడు... ఈ కాంబినేషన్ ఉంటే చాలు... ఎంచక్కా డాక్టరైపోవచ్చు.. కానీ... ఆ డాక్టర్ గెటప్‌తో వైద్యం తప్పితే మిగతావన్నీ చేసెయ్యొచ్చు... వీలైతే పైసా ఖర్చు లేకుండా ఖరీదైన బంగారు గొలుసులు కూడా కొనెయ్యొచ్చు.. కాదుకాదు కొట్టెయ్యొచ్చు.

Krishna District: గోల్డ్ నెక్లెస్ సెలెక్ట్ చేసి ఆస్పత్రికి తెమ్మన్న గవర్నమెంట్ డాక్టర్.. షాపు ఓనర్ ఆ పని చేయగా
Fake Doctor Cheating
Follow us

|

Updated on: Feb 03, 2023 | 7:00 PM

డాక్టర్లంటే జస్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చుడే కాదు.. ఇక్కడ దందాలు, దోపీడీలు కూడా ఇంక్లూడింగ్.. డాక్టర్లందు నకిలీ డాక్టర్లు వేరయా అన్నట్టు.. డాక్టర్ల వేషంలో మోసాలు చెయ్యడం ఇవాళా రేపూ చాలా కామన్. శంకర్‌దాదా పూనాడో ఏమో గాని… కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ డాక్టర్ కాని డాక్టరొకడు… ఖతర్నాక్ దొంగ అవతారమెత్తాడు. సర్వజన ఆసుపత్రిలో సినీ ఫక్కీలో జరిగన ఓ చోరీలో అతగాడే కథానాయకుడు.

ఒక బడా చోర్‌, మరొక జ్యుయెలరీ షాప్ యజమాని పాత్రధారులుగా.. మూడు గోల్డ్ చెయిన్లు కథావస్తువులుగా జరిగిన చోర్ కథా చిత్రం ఇది. డీటెయిల్స్‌ భలే గమ్మత్తుగా ఉంటాయ్. మచిలీపట్నంలో ఒక బంగారు దుకాణానికి నిన్న ఫైన్ మార్నింగ్ ఒక ఫోన్‌ కాలొచ్చింది. నేను డాక్టర్ ఫలానా… మీకు తెలీదా అంటూ పరిచయం చేసుకున్నాడో అగంతకుడు. గవర్నమెంటాస్పత్రిలో ఉన్నా… అంటూ ప్లేస్ కూడా చెప్పేశాడు.  నా భార్యకు మంచి నెక్లెస్ కావాలి.. మీ షాపులో ఉంటాయని తెలిసింది… శాంపిల్‌కి రెండోమూడో నెక్లెస్‌లు ఆస్పత్రి దగ్గరకు తీసుకొస్తే… డబ్బులిస్తా.. డోన్ట్ వర్రీ అంటూ ఆర్డరేశాడు. గొంతు వింటే మంచి నమ్మకస్థుడిగా ఉన్నాడు… అనుకుని ఆ నంబర్‌ని వాట్సప్‌లో ఫీడ్ చేసుకుని… అతడు అడిగినట్టే… శాంపిల్‌ గొలుసులు షేర్ చేశాడు. ఒక్కొక్కటీ లక్షకు పైనే. వాటిలో అతగాడికి బాగా నచ్చిన 18 గ్రాముల నక్లెస్‌ని బ్యాగులో పెట్టుకుని ఆస్పత్రికెళితే… ఇంకేముంది… డామిట్ కథ అడ్డం తిరిగింది.

నెక్లెస్ తీసుకుని… జస్ట్ ఏ మినిట్… డబ్బు తెచ్చి ఇస్తా అంటూ గదిలోకి వెళ్లిన ఈ అపర శంకర్‌దాదా… అట్నుంచటే గాయబ్. నెక్లెస్‌తో వెళ్లిన డాక్టరుగారు ఎంతకీ బైటికి రాలేదు. తలుపు తట్టినా నో రెస్పాన్స్. మరి… ఆ డాక్టరు మీద డౌటనుమానం రాకుండా ఉంటుందా..? రానే వచ్చింది. వెళ్లి చూస్తే… డాక్టరూ లేడు… తానిచ్చిన నెక్లెస్సూ లేదు. ఇంకేముంది… మిగిలిందొక్కటే… కుయ్యోమొర్రో.

దగాపడ్డ నగల వ్యాపారి మచిలీపట్నం పోలీసుల దగ్గరికెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు బందరు డీఎస్‌పీ మాసూం బాషా పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది.  ఈ దొంగ డాక్టర్ చిన్నపాటి అదృష్టమేంటంటే… ఆస్పత్రిలో ఆ ఒక్క గదిలోనే సీసీ ఫుటేజ్ పనిచేయడం లేదు. కాకపోతే… అతగాడి ఫోన్‌ నంబర్‌ని ట్రేస్ చేస్తూ వేట మొదలెట్టారు బందరు ఖాకీలు. సాక్షాత్తూ సర్వజన ఆస్పత్రిలో వైద్యుని గెటప్‌లో చోరీకి పాల్పడ్డ డాక్టర్ ఉదంతం… ఆస్పత్రిలోనే కాదు.. టోటల్‌ మచిలీపట్నంలో ఇప్పుడు షాకింగ్‌న్యూస్. సో… బందరులో మినీ శంకర్‌దాదాలున్నారు జర భద్రం మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..