Konaseema: వారెవ్వా.. చూశారా మన కోనసీమ అందాలు.. ముగ్ధులు అవ్వాల్సిందే..
అల్లూరు జిల్లాలోనే కాదు.. కోనసీమ జిల్లాలోనూ మంచు అందాలు కనువిందుగా మారాయి. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలను నాలుగు రోజులుగా మంచు దుప్పటి కప్పేస్తుండడంతో ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఆ దృశ్యాలు టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. మంచి హాలిడేస్ దొరికితే ఓ ట్రిప్ వేయాలి అంటున్నారు నెటిజన్స్..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్. అలాంటి అందమైన ప్రాంతానికి మంచు తోడైతే ఇంకెలా ఉంటుందో ఊహిస్తేనే మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఈ క్రమంలోనే.. కోనసీమ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మంచు విపరీతంగా కురుస్తోంది. దట్టంగా కమ్మేసిన మంచుతో కోనసీమలోని పలు ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. మంచుతో కూడిన కోనసీమ అందాలు.. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. పచ్చని నేలపై తివాచీలా పరిచిన పంట పొలాలు, ఆకాశంలో గూడులా అల్లుకున్న కొబ్బరి చెట్ల ఆకులు.. గలగలా పారే గోదావరి నదులు, పిల్లకాలువలతో ప్రకృతి సిద్ధంగా ఉండే కోనసీమ అందాలు స్థానికులతో పాటు పర్యాటకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.
పచ్చని కొబ్బరి చెట్లపై స్నోఫాల్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శీతాకాలం మంచుతో కేరళ, ఊటీ, లంబసింగి, కొడైకెనాల్ లాంటి అందమైన పర్యాటక ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. కోనసీమ ప్రకృతి అందాలతోపాటు మెరిసిపోతున్న మంచు అందాలను ఫోన్‌లో బంధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంబరపడిపోతున్నారు. ఇదిలావుంటే.. దట్టంగా మంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం- రాజమండ్రి రహదారిపై మంచు కమ్మేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా.. కాకినాడ, పి.గన్నవరం, అంబాజీపేట, అల్లవరం, కొత్తపేట మార్గాల్లో వాహనదారులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఏదేమైనా.. కోనసీమ మంచు అందాలు మాత్రం ప్రకృతి ప్రేమికులకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
