మేము జగన్‌లా వ్యవహరించి ఉంటే.. వాళ్లు పాదయాత్ర చేసేవారా!

గతంలో ఇలాగే మేము ఇబ్బందులు పెడితే ముఖ్యమంత్రి జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలు చేసేవారా? అంటూ చంద్రబాబు..

మేము జగన్‌లా వ్యవహరించి ఉంటే.. వాళ్లు పాదయాత్ర చేసేవారా!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 19, 2020 | 5:47 PM

టీడీపీ అధినేత చంద్రబాబు.. నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదట ప్రకాశం జిల్లాలో యాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరపబోతున్నారు. ఇందుకోసం తొమ్మిది నెలల జగన్ ప్రభుత్వంలో జరిగిన తొమ్మిది రద్దులు, తొమ్మిది మోసాలు, తొమ్మిది భారాలు.. అంటూ ఎజెండాను సిద్దం చేసుకున్నారు చంద్రబాబు.

ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది.. ఆరు నెలల వరకు ఏమి మాట్లాడం అని చెప్పాం. అలాగే ఉన్నాం. మన అందరి భవిష్యత్తు ఈ పిచ్చి తుగ్లక్ చేతిలో పడిందన్నారు. ఆయన ఏరోజు ఏమి చేస్తాడో ఆయనకే తెలియదు. టీడీపీకి, నాకు అధికారం కొత్త కాదు. నేను ఎప్పుడు పోటీ చేసినా ప్రజల కోసమే కానీ.. ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నారు. దీన్ని అందరూ గమనించాలి.. గతంలో ఏపీ ఎలా ఉంది? ఈ తొమ్మిది నెలల్లో ఏపీ ఎలా ఉందో? ప్రజలు ఆలోచించాలన్నారు.

ఒక్కసారి ఛాన్స్ అంటే.. ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజల భవిష్యత్తు నాశనం చేయటానికే ఈ తుగ్లక్ ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నారు. రైతుకు మద్దతు ధర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతు దగ్గర పంటను కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు ఇళ్లలో కూర్చోకుండా రోడ్లపైకి వచ్చి పోరాడాలన్నారు.

ప్రజలకు ఉపయోగపడే అన్నా కాంటీన్లను కూడా మూసి వేశారు. ప్రజలు నోరు మెదపక పోతే ఇక అన్నీ మూతపడతాయి. ఏ కార్యక్రమం చేసినా అన్నీ ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో ఇలాగే మేము ఇబ్బందులు పెడితే ముఖ్యమంత్రి జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలు చేసేవారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో పెన్షన్స్ అందరికి ఇచ్చాం, ఇప్పుడు అర్హులకే పెన్షన్స్ ఇవ్వటం దారుణం. అందరికి ఇస్తున్నాం అంటున్నారు కానీ తీసేసుకుంటున్న విషయం అర్థం కావడం లేదు.ఎక్కువ కరెంట్ వాడితే రేషన్ కార్డులు తొలగిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.