AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ప్రియురాలితో కలసి పిల్లలను కనాలనే దురుద్దేశం.. ఆమె పతిని చేశాడు ఖతం.. కోడి కత్తులతో

కోడి కత్తితో మర్డర్. దీనంతటికీ కారణం. ఒక వివాహేతర సంబంధం. ప్రియురాలితో కలసి పిల్లలను కనాలనే దురుద్దేశం. దీంతో ఒక నిండు ప్రాణం బలైపోయింది. హత్య చేయించి.. ఆపై మిస్సింగ్ కేసు పెట్టి.. ఏమీ తెలియని అమాయకత్వాన్ని నటించారు. ఇంతకీ ఎక్కడ జరిగిందీ ఘటన? ...

AP News: ప్రియురాలితో కలసి పిల్లలను కనాలనే దురుద్దేశం.. ఆమె పతిని చేశాడు ఖతం.. కోడి కత్తులతో
Eluru Murder Case
Ram Naramaneni
|

Updated on: Oct 09, 2022 | 7:38 PM

Share

ఏలూరు చాటపర్రు రోడ్డు వీవర్స్ కాలనీలో మోర్తా తిమోతీ జోసెఫ్ తంబి, అతడి భార్య విజేత.. కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం తంబికి- తెనాలికి చెందిన అహ్మద్ బాషాతో పరిచయం ఏర్పడింది.  తంబి భార్య విజేతతో బాషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా..బాషా, తంబి నిత్యావసరాల కోసం డబ్బు సమకూర్చుతుండేవాడు. అయితే బాషకు ఒక కోరిక పుట్టింది.  విజేతకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు..ఎంతో సంతోషంగా సాగుతున్న సంసార జీవితంలోకి బాషా రూపంలో ఒక కల్లోలం.  ఈ కల్లోలం కాస్తా మృత్యు సుడిగుండంగా మార్చేసింది బాషా కోరిక. ఇంతకీ బాషా మనసులో పుట్టిన ఆ సుడిగుండం పేరేంటంటే.. ఎలాగైనా సరే తంబి భార్య విజేతతో పిల్లల్ని కనాలనుకోవడం.

ఎప్పుడైతే పిల్లల్ని కనాలన్న ఆలోచన ఏర్పడిందో.. ఐవీఎఫ్ పరీక్షలు సైతం నిర్వహించాడు బాషా. ఈ విషయం తంబికి చెప్పగా.. అతడెంత మాత్రం ఒప్పుకోలేదు.. మరీ మరీ అడటంతో ఒక కండీషన్ పెట్టాడు. తనకు గానీ ఐదు లక్షల రూపాయలను ఇస్తే.. తన భార్య చేత పిల్లల్ని కనడానికి ఒప్పుకుంటానని అన్నాడు. ఇప్పటికే ఐవీఎఫ్ మీద రెండు లక్షల రూపాయలను ఖర్చు చేసిన బాషాకు మరో ఐదు లక్షలు ఖర్చంటే కష్టమనిపించింది. ఇలాక్కాదనుకున్న బాషా.. తంబి హత్యకు స్కెచ్చేశాడు. ఇందుకు విజేత నుంచి కూడా అంగీకారం కుదరడంతో ఇక హతమార్చడమే ఆలస్యంగా పథక రచన చేశాడు బాషా. తంబి హత్యకు బాషా తన మేనల్లుడు షేక్ రబ్బాని, భార్గవ్ రెడ్డి అనే ఇద్దరితో ఒప్పందం కుదర్చుకున్నాడు. అంతే కాదు.. రెండు నెలల క్రితం.. కోడికత్తులను కూడా తయారు చేయించాడు.

అక్టోబర్ ఒకటిన బాషా తంబికి ఫోన్ చేశాడు. ఏలూరు వస్తున్నాననీ.. కోడి పుంజులు కొనడం కోసం వెళ్దామనీ చెప్పాడు. అక్టోబర్ 2న కారులో బాష తన ఇద్దరు అనుచరులతో కలసి తంబిని కారు ఎక్కించుకున్నాడు. రామసింగవరం లో అరవై వేలు పెట్టి రెండు కోడిపుంజులను కొన్నాడు. అక్కడి నుంచి కారులో చీకటి పడే వరకూ తిరిగి కామవరపు కోట మండలం, వీరిశెట్టిగూడంలో ఆగారు. తమ వెంట తెచ్చుకున్న కోడికత్తులతో తంబి గుండె, పీకపై దాడి చేసి హత్య చేశారు. తర్వాత ఈ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లారు. బాపట్ల జిల్లా, అప్పికట్ల యారా కాల్వ దగ్గరకొచ్చి.. డెడ్ బాడీని అందులో పడేశారు. ఇలా చేస్తే ఆ మృతదేహం సముద్రంలోకి కొట్టుకెళ్తుందన్నది వీళ్ల ఆలోచన.

ఇదిలా సాగుతుండగా తంబి భార్య విజేత.. ఈ నెల 3న భర్త కనిపించడం లేదంటూ.. ఏలూరు వన్ టౌన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. రెండో తేదీన తన భర్త బాషాతో కలిసి వెళ్లాడని చెప్పింది. ఇక్కడే ఆమె పోలీసులకు అతి పెద్ద క్లూ ఇచ్చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. బాషాను అదుపులోకి తీసుకెళ్లి విచారించారు. దీంతో వీళ్ల బండారం మొత్తం బయట పడింది.బాషా అంచనాలు తలకిందులయ్యాయి. సముద్రంలో వెళ్లి కలుస్తుందనుకున్న తంబి డెడ్ బాడీ.. కాస్తా అక్కడే నిలబడి పోయింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. యారా కాల్వలో తంబి మృతదేహాన్ని గాలించి వెలికి తీశారు పోలీసులు. ఈ హత్య కేసులో ఏవన్ గా బాషా.. మిగిలిన ఇద్దరు నిందితులుగా రబ్బాని, భార్గవరెడ్డిని గుర్తించి.. కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. ఈ కేసులో మృతుడి భార్య పాత్ర ఎంత? కుట్రలో ఆమె భాగమెంత? వంటి వివరాలు విచారణ పూర్తయ్యాక గానీ బయట పడదంటున్నారు పోలీసులు. మరి చూడాలి.. ఈ హత్య కేసు ఎక్కడ తేలుతుందో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..