ఎకరన్నర పొలంలో అద్భుతం చేసిన రైతు.. ఆ క్షేత్రానికి వివిధ దేశాల శాస్త్రవేత్తల క్యూ..
ఏలూరు జిల్లా నాచుగుంటకు చెందిన రైతు జి. వెంకటరత్నం ఇండోనేషియా ‘ఫిష్–ప్యాడీ’ విధానాన్ని అనుసరిస్తూ 1.5 ఎకరాల్లో సమీకృత సాగుతో సిరులు పండిస్తున్నారు. వరి, చేపలు, పండ్ల తోటలు, కూరగాయలను ఒకే క్షేత్రంలో సాగు చేస్తూ ఏటా లక్షల రూపాయల నికర లాభం ఆర్జిస్తున్నారు.

వ్యవసాయం దండగ కాదు.. సరికొత్త ప్రయోగాలతో సాగు చేస్తే అద్భుతాలు సృష్టించే పండగ అని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఆదర్శ రైతు జి. వెంకటరత్నం. ప్రకృతి వైపరీత్యాలు, పెరుగుతున్న పెట్టుబడులు, మార్కెట్ సమస్యలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్న తరుణంలో.. వినూత్న సాగు విధానంతో ఆయన అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నాచుగుంట గ్రామానికి చెందిన వెంకటరత్నం.. ఇండోనేషియాలో ప్రాచుర్యంలో ఉన్న ‘ఫిష్–ప్యాడీ’ సమీకృత సాగు విధానాన్ని తన భూమికి అనుగుణంగా మార్చుకుని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఆయన సాగు విధానాన్ని పరిశీలించేందుకు ఇప్పటివరకు ఏకంగా 11 దేశాల వ్యవసాయ ప్రతినిధులు ఆయన క్షేత్రాన్ని సందర్శించడం విశేషం.
ఒకటిన్నర ఎకరాల్లో.. మూడు అంచెల సాగు
వెంకటరత్నానికి మొత్తం 9.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 1.5 ఎకరాలను సమీకృత వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేశారు. భూమిలోని ప్రతి అంగుళాన్నీ సద్వినియోగం చేసుకునేలా క్షేత్రాన్ని మూడు అంచెలుగా విభజించారు. మధ్యలో 70 సెంట్ల విస్తీర్ణంలో దేశవాళీ వరి సాగు చేస్తున్నారు. దాని చుట్టూ 5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో కందకం ఏర్పాటు చేసి.. అందులోని 40 సెంట్ల నీటి విస్తీర్ణంలో చేపల పెంపకం చేపట్టారు. కందకం నుంచి తీసిన మట్టితో 6 మీటర్ల వెడల్పుతో గట్లను నిర్మించి, మిగిలిన 40 సెంట్లలో పండ్ల తోటలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇలా నీటిలో చేపలు, మధ్యలో సేంద్రియ వరి, గట్లపై పండ్ల మొక్కలు.. ఒకదానికొకటి అవసరమైన పోషకాలను అందించుకుంటూ సహజ సమతుల్యతను కాపాడుతున్నాయి.
2007 నుంచే ప్రకృతి వ్యవసాయం
రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా 2007 నుంచే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని వెంకటరత్నం అనుసరిస్తున్నారు. నాట్లకు ముందే పచ్చిరొట్ట ఎరువులు, చిరుధాన్యాలను పొలంలో చల్లి కలియదున్నుతున్నారు. తన వద్ద ఉన్న ఆరు దేశీ ఆవుల నుంచి లభించే పేడ, మూత్రంతో ఘన, ద్రవ జీవామృతాలు, పంచగవ్యను తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. తెగుళ్ల నివారణకు వివిధ రకాల ఆకులతో తయారు చేసిన కషాయాలు, కోడిగుడ్డు–నిమ్మరసం మిశ్రమాలను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ప్రత్యేక ట్యాంకును ఏర్పాటు చేశారు.
దేశవాళీ వరి రకాలకే ప్రాధాన్యం
రసాయన రహిత పద్ధతిలో కూజి పటాలి, రక్తశాలి, రత్నచోడి, నవార, మైసూరు మల్లిక, తులసి బాసు తదితర ఔషధ గుణాలున్న దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నారు. ఈ విధానంలో ఎకరానికి సగటున 38 బస్తాల వరకు దిగుబడి సాధిస్తున్నారు. చేపల చెరువులోనూ రసాయనాలకు తావులేకుండా పంచగవ్య, సహజ ఆహారాన్ని వినియోగిస్తున్నారు. దీంతో చెరువులో వదిలిన 3,000 చేప పిల్లల్లో 100 శాతం మనుగడ సాధించగలిగారు.
గట్లపై 50కిపైగా పండ్ల రకాలు
కందకాల గట్లు కోతకు గురికాకుండా పటిష్టంగా నిర్మించడంతో పాటు వాటిపై పెద్ద ఎత్తున పండ్ల మొక్కలను పెంచుతున్నారు. 80 కొబ్బరి చెట్లు, 700 అరటి మొక్కలతో పాటు మామిడి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, అంజూర, పల్సా తదితర 50కిపైగా పండ్ల రకాలను సాగు చేస్తున్నారు. పూజా పత్రి మొక్కలకూ ఇందులో స్థానం కల్పించారు.
దళారులను పక్కనపెట్టి.. నేరుగా విక్రయాలు
వ్యవసాయంలో సాగుతో పాటు మార్కెటింగ్ కూడా ముఖ్యమని భావించిన వెంకటరత్నం.. దళారులపై ఆధారపడకుండా తన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పండించిన వడ్లను స్వయంగా మిల్లింగ్ చేయించి దేశవాళీ బియ్యంగా మార్చి కిలో రూ.80 నుంచి రూ.85 చొప్పున ఢిల్లీ, పుణె, బెంగళూరు నగరాలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో పెంచిన చేపలను సాధారణ మార్కెట్ ధర కంటే అధికంగా కిలో రూ.170 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను ఈ చిన్న సమీకృత వ్యవసాయ యూనిట్ నుంచే ఏటా రూ.1.80 లక్షల నుంచి రూ.3.29 లక్షల వరకు నికర లాభం పొందుతున్నారు.
వ్యవసాయంతోనే పిల్లలకు ఉన్నత విద్య
‘రైతు చెప్పులు, బట్టలు, ఉప్పు మినహా బయట నుంచి ఏదీ కొనకూడదు’ అనే స్వావలంబన సూత్రాన్ని వెంకటరత్నం ఆచరణలో చూపిస్తున్నారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే తన ఇద్దరు పిల్లలను విదేశాల్లో చదివించి ఉన్నత విద్యావంతులను చేశారు.
స్వల్ప విస్తీర్ణంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ బహుళ ఆదాయ మార్గాలను సృష్టించవచ్చని వెంకటరత్నం నిరూపిస్తున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ‘ఫిష్–ప్యాడీ’ సమీకృత సాగు విధానం ఆచరణాత్మకమైన మార్గదర్శకంగా నిలుస్తోంది.
