NEET UGపై కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే పరీక్ష..? వేగంగా కేంద్రం కసరత్తు
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG పరీక్ష విధానంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఇప్పటివరకు పెన్, పేపర్ విధానంలో నిర్వహిస్తున్న నీట్‌ను వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా మార్చే అంశంపై కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు అవసరమైన జాతీయ స్థాయి CBT మౌలిక వసతుల వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే NEETను ఆన్‌లైన్‌లో నిర్వహించడంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు..

హైదరాబాద్, అక్టోబర్ 1: నీట్ యూజీ 2027 పరీక్షా సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ సిఫార్సుల తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రాల లభ్యతలో ఉన్న భౌగోళిక అంతరాలను తగ్గించడం, దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలకు ఒకే విధమైన ప్రమాణాలను తీసుకురావడం, పెన్-పేపర్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం లక్ష్యంగా కేంద్రం వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఈ వ్యూహంలో వివిధ సంస్థలు, వనరుల ద్వారా మౌలిక వసతులను సమకూర్చుకునే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
NEETతో పాటు ఇతర పరీక్షలూ ఆన్‌లైన్‌లోకి?
ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే పలు కీలక ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తోంది. JEE-Main, CUET-UG, CUET-PG, UGC-NET, CSIR-UGC-NET వంటి పరీక్షలు CBT విధానంలోనే జరుగుతున్నాయి. జాతీయ స్థాయి CBT మౌలిక వసతుల వ్యూహం అమల్లోకి వచ్చిన తర్వాత పెన్-పేపర్ విధానంలో నిర్వహిస్తున్న ఇతర ప్రవేశ పరీక్షలను కూడా ఆన్‌లైన్ విధానంలోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. NEETను పెన్-పేపర్ నుంచి CBTకి మార్చే ప్రక్రియలో పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష విధానం మార్పు, దశలవారీగా అమలు, అవసరమైన మౌలిక వసతులు, గ్రామీణ ప్రాంతాలు, మహిళా అభ్యర్థులు, ఇంటర్నెట్ సదుపాయాలు తక్కువగా ఉన్న జిల్లాల విద్యార్థులపై ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ అంశాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
NEET-UG పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన సంస్కరణలను ఈ కమిటీ సూచించనుంది. ప్రస్తుతం ఈ కమిటీ నివేదిక కోసం కేంద్రం ఎదురుచూస్తోంది. దేశంలోనే అతిపెద్ద అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షల్లో NEET-UG ఒకటి. ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. NEET ఫలితాల ఆధారంగా దేశంలోని వైద్య కళాశాలల్లో MBBS సీట్లతో పాటు డెంటల్, ఆయుర్వేద, యునాని, సిద్ధ వైద్య కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా MBBS కోర్సుకు సుమారు 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సుమారు 56 వేల సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 52 వేల సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నట్లు సమాచారం.
NEETను CBT విధానంలో నిర్వహించాలనే ఆలోచన కొత్తది కాదు. గతంలోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. అయితే పరీక్షా వ్యవస్థలో సంస్కరణలపై ప్రస్తుతం జరుగుతున్న కసరత్తుతో ఈ ప్రతిపాదనకు మరింత ప్రాధాన్యం లభించింది. నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ సిఫార్సులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ మెడికల్ కమిషన్‌తో సంప్రదింపుల అనంతరం NEET-UGను CBT విధానంలోకి మార్చడంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




