వరదల్లో కొట్టుకుపోతున్న కారు.. ఆపద్భాంధవులైన స్ధానికులు.. సలాం కొట్టిన ఏలూరు ఎస్పీ!

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి జన జీవనాన్ని స్తంభించింది. తమ ప్రాణాలు లెక్కచేయకుండా ఓ కుటుంబాన్ని ప్రాణాలతో కాపాడారు సాహస వీరులు.

వరదల్లో కొట్టుకుపోతున్న కారు.. ఆపద్భాంధవులైన స్ధానికులు.. సలాం కొట్టిన ఏలూరు ఎస్పీ!
Eluru Sp
Follow us
B Ravi Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Aug 29, 2024 | 7:49 PM

ప్రస్తుత సమాజంలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, లేక కష్టాల్లో ఉన్న మనకెందుకులే అని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటివి సహజంగా రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాలు జరిగినప్పుడు పక్కనే వెళుతూ కూడా కొందరు తమకు ఏం పట్టనట్టు చూసి చూడకుండా వ్యవహరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ కొందరైతే తమకు ఏమైనా పర్వాలేదు పక్కవాడి ప్రాణం కాపాడటమే మానవత్వంగా భావించి ఆపదలో ఉన్న వారిని రక్షించి సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటననే ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.

తమ ప్రాణాలు లెక్కచేయకుండా ఓ కుటుంబాన్ని ప్రాణాలతో కాపాడారు సాహస వీరులు. జూలై 18వ తేదీన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి జన జీవనాన్ని స్తంభించింది. విలీన మండలాలైన వేలేరుపాడు, కుకునూరులో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. అయితే ఆ సమయంలో రాజమండ్రి నుంచి ఓ కుటుంబం వేలూరుపాడు మండలం రుద్రంకోటకు కారులో బయలుదేరారు. అయితే కారు అల్లూరు నగర్ దాటి కోయమాదారం వెళుతున్న సమయంలో రహదారిపై కోడిసెల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. కాలువ ఉధృతిని అంచనా వేయని కారు డ్రైవర్ రహదారిపై ప్రవహిస్తున్న కాలువలో ముందుకు వెళ్లాడు.

దాంతో వరద ఉధృతికి కారు ఒక్కసారిగా అదుపుతప్పి కాలవలోకి వెళ్ళిపోయింది. అది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎటు చూసినా నీరు, మరోపక్క ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువ. వారిని ఎలా రక్షించాలో కూడా తెలియని అయోమయ గ్రామస్తులలో నెలకొంది. వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు సైతం చేరవేశారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అధికారులు సైతం అక్కడికి చేరుకోవడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో గ్రామస్తులు ఎలా అయినా వారిని కాపాడాలని అనుకున్నారు. వెంటనే చేయి చేయి పట్టుకుంటూ తాళ్ల సహాయంతో చెట్టుకు కట్టుకుంటూ ముందుకు వెళ్లారు.

అలా ఒక్కొక్కరుగా బలమైన వరద ఉధృతికి ఎదురు వెళ్లి కాలువలో చిక్కుకొని ఉన్న కారు వద్దకు వెళ్లారు. కారులో ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఇద్దరు చిన్నారులతో పాటు, ఇద్దరు మహిళలు, కారు డ్రైవర్‌ను ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వారికి ధైర్యం చెప్పారు. కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బాధితులను కాపాడిన గ్రామస్తులను అందరూ అభినందించారు. తాజాగా ఈ సాహస వీరుల గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. కారు ప్రమాదంలో చిక్కుకున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడిన కొంటిపాటి శివాజీ, చాపర్ల శ్రీనివాసరావు, మొడియం ధర్మయ్య, చిలకలూరి లక్ష్మణరావు, శ్రీను, ఎలుపల ప్రసాద్, కట్టి పాపారావు, సున్నం ప్రసాద్ లను ఏలూరు ఎస్పీ ఆఫీసులో శాలువాలతో ఘనంగా సత్కరించారు జిల్లా ఎస్పీ. అంతేకాక వారికి ఎన్‌ఆర్‌కే ఫౌండేషన్ వారి లైఫ్ జాకెట్‌లను అందించారు. అలాగే రూ. 10 వేల నగదు బహుమతిని ఇచ్చారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం కన్న గొప్ప విషయం ఏమీ లేదని, వారి సాహసం వెల కట్టలేనిదని ఎస్పీ కొనియాడారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..