ఏపీలో ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు.. ఈసీకి భారీగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నాటి నుంచి ప్రత్యేక బృందాలతో ఎక్కడ ఎలాంటి గొడవలు గాని, హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వాటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తక్షణమే చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాల వారీగా కూడా చేస్తున్న ఏర్పాట్లపై ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తున్నారు. ఎన్నికల్లో శాంతిభద్రత సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల ఏర్పాటుతోపాటు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. అంతఃరాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా తనిఖీలు మమ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ కారణాల చేత ఆయుధాలు లైసెన్సులు తీసుకున్న వారి వద్ద నుంచి గన్ లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,681 లైసెన్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో 17 ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.
పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్న నగదు..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద 150 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రం లోపల 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై ఉన్న బ్యానర్లు, పోస్టర్లు, వాల్ పెయింటింగులు తొలగించారు. ఎన్నికలకు సంబంధించి జరిగిన హింసలో ఒకరు మరణించగా, 31 మంది గాయపడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 247 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సి -విజిల్ యాప్ ద్వారా భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వచ్చిన ఫిర్యాదులను త్వరితగతన పరిష్కరిస్తూ పెండింగ్ లేకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు సి – విజిల్ యాప్ ద్వారా 7838 ఫిర్యాదులు అందాయి. పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 17 కోట్ల 85 లక్షల నగదు సీట్ చేశారు. 882 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 163 గ్రాముల డ్రగ్స్,1236 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా పట్టుబడిన వాటికి సంబంధించి 4337 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..