Andhra News: ఏపీలో ఆయుధాగార నిర్మాణానికి నిర్ణయం.. ఎక్కడో తెలుసా?
బ్రిటిష్ కాలంనాటి ఎయిర్‌పోర్టుకు పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి మినీ ఎయిర్‌పోర్టును ఆయుధాగార నిర్మాణంగా పునరుద్ధరించాలని తూర్పు నావికా దళం ఆలోచిస్తోంది. ఆ దిశగా ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. బ్రిటిష్ కాలంలో ఒక వెలుగు వెలిగి కనుమరుగైన నాటి ఎయిర్ పోర్ట్ నేడు భారత రక్షణా రంగానికి చెందిన ఆయుధ సంపత్తిని భద్రపరచడానికి అనువైన ప్రదేశంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు నావీ అధికారులు.

నాడు రక్షణ అవసరాలకు వినియోగించిన బాడంగి విమానాశ్రయం పునర్నిర్మాణానికి భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఇక్కడి ప్రాంతంలో భూ సర్వే కూడా ప్రారంభించింది. విజయనగరం జిల్లా బాడంగిలోని మినీ విమానాశ్రయంను తిరిగి నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా మొదలయ్యాయి. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగించిన ఈ ఎయిర్‌పోర్టును మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని భారత నావికాదళం ఆలోచిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శత్రు దేశాల ముప్పు ఎదుర్కొనేందుకు మరో నేవీ ఆయుధ కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ మినీ విమానాశ్రయంను రెండో ప్రపంచ యుద్ధంలో రక్షణ అవసరాలకు వినియోగించే వారు. అనంతరం 1946లో దీన్ని మూసేశారు. తర్వాత దీనిని ఎఫ్‌సిఐ ధాన్యం నిల్వలకు కేంద్రంగా ఉపయోగించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూములు కొంతమేర రైతుల సాగులో కూడా ఉన్నాయి.
అప్పట్లో ఆయుధ కేంద్రంగా ఉన్న బాడంగి ఎయిర్‌పోర్ట్ 227 ఎకరాల పరిధిలో ఉండేది. తర్వాత అది నిరుపయోగమైంది. అప్పట్లో ఇక్కడ ఉండే గోడౌన్లు కాలక్రమేణా ధ్వంసం కాగా విమానాలు ల్యాండ్ అయ్యే రన్‌వే మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఎయిర్ పోర్ట్ భూములు కొంత ఆక్రమణలకు గురయ్యాయి. అయితే ఈ ఎయిర్‌పోర్టును పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఆయుధాలు భద్రపరిచే గోడౌన్లు, బంకర్లను శత్రుదేశాలు గుర్తించకుండా ఉండడానికి ఈ ప్రాంతం అణువైందిగా నేవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. విశాఖకి చేరువగా ఉన్న ఈ ప్రదేశంలో భారత రక్షణరంగ ఆయుధాగారాన్ని ఏర్పాటు చేయడమే శ్రేయష్కారమని అధికారులు యోచిస్తున్నారు. అలాగే ఫైటర్ జెట్ల ఫైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా బాడంగి విమానాశ్రయం ఉపయోగపడుతుందని నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఆయుధాగార నిర్మాణానికి సుమారు 2,500 ఎకరాల మేర భూమి అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వమే భూసేకరణ జరిపి తమకు ఇవ్వాలని నావికాదళం ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది. అందుకోసం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి? ప్రవేట్ భూములు ఎంతవరకు భూసేకరణ జరపాల్సి వస్తుంది అనే కోణంలో రెవెన్యూ అధికారులు సర్వే జరుపుతున్నారు. నావికాదళం నుండి అధికారికంగా పూర్తిస్థాయి కరస్పాండెన్స్ జరిగితే రైతులతో సమావేశాలు నిర్వహించి సమ్మతి తెలుసుకోవలసి ఉందని అధికారులు చెప్తున్నారు. అందుకోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




