శ్రీశైలం దేవస్థానంలో ఎస్సీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయండి!
శ్రీశైలం దేవస్థానంలో జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, రిజర్వేషన్ల అమలును పరిశీలించారు. దేవస్థానంలోని SC/ST సిబ్బంది సంఖ్య, సంక్షేమ పథకాల అమలును సమీక్షించి, దళిత సంఘాల నాయకుల వినతులను స్వీకరించారు. దేవస్థానంలో చారిత్రక వస్తువులను ప్రదర్శించేందుకు మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని కార్యదర్శి తెలిపారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు ఈవో పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియమకాలు, పదోన్నతులు, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల అమలు తీరు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి నిర్వహణలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. మంగళవారం దేవస్థాన కార్యాలయంలోని సమీక్షా సమావేశం పరిపాలన భవనంలో జరిగిన ఈ సమీక్షలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి డి.నాగజ్యోతి, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి యం.చింతామణి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేవస్థానంలో 148 మంది షెడ్యూల్డ్ కులాల సిబ్బంది పనిచేస్తున్నట్లు, అందులో శాశ్వత సిబ్బంది 32 మంది, ఒప్పంద సిబ్బంది 50 మంది, పొరుగుసేవల సిబ్బంది 66 మంది ఉన్నట్లు తెలిపారు.
మొత్తం 32 మంది శాశ్వత సిబ్బందిలో సహాయ కార్యనిర్వహణాధికారులు 2, పర్యవేక్షకులు -3, సీనియర్ అసిస్టెంట్లు -1, జూనియర్ అసిస్టెంట్లు -2, రికార్డు అసిస్టెంట్లు -9, నాల్గవ తరగతి సిబ్బంది – 14 మంది ఉన్నారని అన్నారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ కార్యదర్శి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవస్థానంలో గల ఉద్యోగ నియామకాలు, పదోన్నతులలో రిజర్వేషన్ విధానాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలిన అధికారులను ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన చారిత్రక శాసనాలను, విశేషాలను, తామ్రశాసనాలను ప్రతి ఒక్క భక్తుడు చూసేందుకు వీలుగా ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి తాను కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.
నంద్యాల జిల్లాలో షెడ్యూల్డ్ సామాజికవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వారు అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి పథకాలపై నంద్యాల జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థల వారితో సమీక్షించారు. అనంతరం అటెండరు స్థాయి నుంచి రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన జె.వి. నరసింహులు, ఇ. మధుసూదన్, బి. చిన్న, సి.హెచ్. విమల, వై.జ్యోతి, కె. రాధమ్మ వారికి కార్యదర్శి చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. శ్రీశైలంలో దళితులకు జీవనోపాధి కోసం దుకాణాలు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎస్సీ కమిషన్ కార్యదర్శి కి దళిత సంఘాల నాయకులు ఆనంద్, వై. ఆశీర్వాదం, దారి వేముల శ్రీనివాస్, ఇషాక్, మయూరి, చంటి వినతి పత్రాలను అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




