Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ-హాజరు విధానం..ఉద్యోగుల్లో ఆందోళన.. నిమిషం నిబంధన సడలిస్తామన్న మంత్రి..
నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో ఉపాధ్యాయులంతా ఈ-అటెండెన్స్ సిస్టమ్ ను వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగారు. దీంతో ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టమ్ అమలుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా తొలుత విద్యాశాఖలో ఈవిధానాన్ని అమలులోకి తీసుకురావడం.. నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ప్రభుత్వం నిబంధన తీసుకురావడంతో ఉపాధ్యాయులంతా ఈ-అటెండెన్స్ సిస్టమ్ ను వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగారు. దీంతో ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారయణ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.
ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగి తప్పనిసరిగా సమయానికి స్కూలు లేదా ఆఫీసుకు రావల్సి ఉంటుంది. వారు ఆప్రదేశంలో ఎన్ని గంటలు ఉంటున్నారు. ఎన్ని గంటలు పనిచేస్తున్నారో ఆన్ లైన్ కానుంది. ఎవరైనా ఉద్యోగి మూడు రోజులు ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తొలుత విద్యాశాఖలో ఈవిధానాన్ని అమలులోకి తీసుకురావడంతో ఉపాధ్యాయులంతా ఆందోళనకు దిగారు. తాము ఈ-అటెండెన్స్ విధానాన్ని వ్యతిరేకించడం లేదంటూనే.. తమ సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకోబోమని, ఇంటర్నెట్, సిగ్నల్ సమస్యల పేరుతో నిరసనలు చేపట్టారు. అయితే ఎలాగైనా ఈవిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. విద్యాశాఖ తర్వాత ఈవిధానాన్ని అన్ని ప్రభుత్వ శాఖలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది సమయానికి విధులకు రాకపోవడం, సమయం కాకముందే వెళ్లిపోవడం ఎక్కువుగా జరుగుతుండటంతో.. వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ-అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో పాటు నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని చెప్పడంతో ఉద్యోగులు ఈవిధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతుందని.. అలాంటప్పుడు దానిని లీవ్ పరిగణించడం ద్వారా తాము నష్టపోతామనే వాదనను తీసుకొచ్చారు. అయితే ఏదైనా సమస్య కారణంగా ఆలస్యం అవ్వడం అప్పుడప్పుడు జరుగుతుందని.. తరచూ జరగదు కాబట్టి.. మూడు సార్లు లేట్ గా వస్తే హాఫ్ డే లీవ్ గా పరిగణిస్తామని ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అయితే ఏదో ఒక సాకుతో ఈ-అటెండెన్స్ విధానాన్ని వెనక్కి తీసుకునేలా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ-అటెండెన్స్ సిస్టమ్ ను అమలుచేయాల్సిందేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..