Palnadu: మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..
మద్యం మత్తు స్నేహితుల మధ్య ఘర్షణకు, చివరకు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘటనలో మద్యం సేవించిన ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం తీవ్రంగా మారి ఒకరి మృతి చెందగా, మరో వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

మద్యం మత్తు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్, నాగరాజులు స్నేహితులు. ఇద్దరూ వివాహితులు. వేరువేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ.. మంచి స్నేహం ఉండటంతో కలిసి మద్యం సేవించేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. నాగరాజు సెంట్రింగ్ పనిచేసి జీవిస్తుండగా.. ప్రతాప్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా ఇద్దరూ కలుసుకున్నారు. మద్యం సేవించేందుకు షాపుకు వెళ్లారు. ఇద్దరూ ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోదామని డిసైడ్ అయ్యారు. నాగరాజు ఇంటి సమీపానికి వెళ్లేసరికి.. ఇద్దరి మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ప్రతాప్.. నాగరాజుని రెట్టించాడు. చంపుతావా చంపు అంటూ మద్యం మత్తులోనే ప్రతాప్ గదమాయించాడు. మత్తు తలకెక్కడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో నాగరాజు.. ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చాడు. నాగరాజు కత్తితో రావడంతో ప్రతాప్ మరింత కోపంగా కేకలు వేశాడు. దీంతో నాగరాజు తన చేతిలో ఉన్న కత్తితో ప్రతాప్‌పై దాడి చేశాడు. ఛాతీతో పాటు పొట్టలోనూ పొడిచాడు.
కత్తి పోట్లకు తీవ్ర గాయాలైన ప్రతాప్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపట్లోనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు అలెర్ట్ అయ్యేసరికే.. ప్రతాప్ ప్రాణం పోయింది. పుల్లుగా మద్యం తాగి సరదాగా తిట్టుకుంటున్నారని భావించిన స్థానికులు ఒక్కసారిగా హత్య జరగడంతో నిర్ఘాంతపోయారు. సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ప్రతాప్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నాగరాజు వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరూ పిల్లలున్నారు. స్నేహితుడి చేతిలో హత్య గురికావడంపై ఇరు కుటుంబాల చెందిన వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించవద్దని వారించినా వినకుండా ఫుల్‌గా తాగి ఒకరి మరణానికి కారణమయ్యాడంటూ నాగరాజుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
