Pawan Kalyan: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు..మోదీతో భేటీ తర్వాత పవన్‌కి క్లారిటీ..వైసీపీకి కూటమే ప్రత్యామ్నాయామా..

నిన్నటి దాకా ఒక మాట. ఇప్పుడు మరో బాట. ఏపీలో ఆయన ప్రస్తుతం కింగ్‌ కాకపోయినా, కింగ్‌మేకర్‌ లాంటి వాళ్లు. కాలం కలిసొస్తే సీఎం కూడా అయ్యే చాన్స్‌ ఉందని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఆ కాలం కలిసొస్తోందట. జాతీయ పార్టీ దీనికి ప్రోత్సాహం ఇస్తోందట.

Pawan Kalyan: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు..మోదీతో భేటీ తర్వాత పవన్‌కి క్లారిటీ..వైసీపీకి కూటమే ప్రత్యామ్నాయామా..
Pawan Meeting With PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 17, 2022 | 7:51 PM

నిన్నటి దాకా సైకిల్‌ అన్నారు! స్పాట్‌ పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు. ఇప్పుడు కమలంతో నా ప్రయాణం అంటున్నారా? ఇప్పుడు వీస్తున్న రాజకీయ పవనాలు ఎటువైపు? నిన్నటిదాకా ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాక ఓ లెక్క అని ఓ సినిమాలో అన్నట్టు, మోదీని కలవకముందు పవన్‌ కల్యాణ్‌ ఒక లెక్క, కలిసిన తర్వాత మరో లెక్క అన్నట్టు ఏపీ రాజకీయం మారుతోందా? వైసీపీకి జనసేన-బీజేపీనే ప్రత్యామ్నాయమా?  విశాఖలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యాక పవన్‌ కల్యాణ్‌ రాజకీయ రూటు మారిందా? పవన్‌ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? రోడ్‌ మ్యాప్‌ వచ్చేశాక, ఆయనకు నచ్చేశాక ఇక టీడీపీ వైపు చూడరా? ఏపీలో బలంగా ఉన్న అధికార వైసీపీకి బీజేపీ-జనసేన కూటమే ఇక ప్రత్యామ్నాయంగా ఎదగబోతోందా? అంటే అవుననే అంటున్నాయిట బీజేపీ, జనసేన వర్గాలు.

టీడీపీ జనసేన మధ్య దూరం..

ఏపీలో మొన్నటివరకు టీడీపీ-జనసేన కలవబోతున్నాయి అంటూ వార్తలు వినిపించాయి. విజయవాడలో చంద్రబాబు వెళ్లి పవన్‌ను కలవడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిందంటున్నారు. మొన్నటిదాకా బీజేపీని కూడా టీడీపీతో పొత్తుకు ఒప్పించాలని పవన్‌ ప్రయత్నించారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే టీడీపీతో తామే కలవనే కలవమంటూ బీజేపీ తెగేసి చెప్పింది. అయితే కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీతో పవన్‌ భేటీ అయ్యాక టీడీపీ-జనసేన మధ్య దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోందంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఇది నిజమే నని బీజేపీ, జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయిట.

టీడీపీతో వెళితే.. బీజేపీతో కలిస్తే..

ప్రధానితో భేటీ తర్వాత టీడీపీకి పవన్‌ దూరం ఎందుకు అయ్యారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీతో కలిసి వెళితే జనసేనకు వచ్చేది కేవలం కొన్ని సీట్లు మాత్రమే, ముఖ్యమంత్రి పదవి రాదు. సీఎం అయ్యేది చంద్రబాబే కాబట్టి పవన్‌ ముఖ్యమంత్రి కాలేరు. అదే బీజేపీతో జనసేన కలిసి ఎన్నికలకు వెళితే పవన్ సీఎం అయ్యే చాన్స్‌ ఉంది. టీడీపీతో వెళితే పూర్తిగా నష్టపోతారు. ఇదే అంశాన్ని పవన్‌కి మోదీ వివరించినట్టు బీజేపీ, జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా బీజేపీ-జనసేన కూటమి బలంగా ఉంటే టీడీపీ వైపు ఎవ్వరూ చూడరు అని, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు మన కూటమిలోనే చేరతారని పవన్‌తో మోదీ చెప్పారట. దానికోసం కూటమిని బలోపేతం చేయాలని పవన్‌తో మోదీ అన్నారని చెబుతున్నారు.

బాగా అర్థమయ్యేట్లు పవన్‌కి వివరించారట..

అందుకే ఆ మీటింగ్ తరువాత మోదీని పొగుడుతూ పవన్‌ ట్వీట్‌ చేశారని ఆ వర్గాలు చెబుతున్నాయిట. కేంద్రంలో ఎంతో బలంగా వున్న బీజేపీ వెంట ఉంటే ఇక భయపడడం దేనికి అని బీజేపీ నేతలు బాగా అర్థమయ్యేట్లు పవన్‌కి వివరించారట. అందుకే తమను వదిలి పవన్‌ ఎక్కడకు వెళ్లరని బీజేపీ నేతలు కూడా చాలా ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ నేతల్లో కనిపిస్తున్న ధీమాకు కారణం అదే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందట. ఇక పవన్‌ బీజేపీకి దగ్గరై, సైకిల్‌కు దూరమైతే టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జోరుగా జరుగుతోందంటున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం