ఆ జిల్లా వాసులను హడలెత్తిస్తున్న పిచ్చికుక్క.. ఒక్క నెలలో ఎంమందిని కరిచిందో తెలిస్తే..
కుక్క విశ్వాసానికి ఎంత నమ్మకమైనదో.. ఇటీవల కాలంలో అంతే ప్రాణాంతమైనదిగాను తయారవుతున్నాయి. కుక్క కాటుకు వేలాది మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అనేకమంది మృత్యువాత పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నెలకు సుమారు 400 మంది కుక్కకాటు బారిన పడి వైద్యం కోసం హాస్పిటల్స్‌కి వస్తున్నట్లు జిల్లా వైద్య గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో కేవలం 34 రోజుల వ్యవధిలో కుక్కకాటు వల్ల ఇద్దరు వ్యక్తులు, రెండు ఎద్దులు చనిపోయాయి.

కిందటి నెల 14న జిల్లాలోని లావేరు మండలం మురపాక గ్రామంలో కుక్క కరవడంతో బొడ్డ అజయ్ అనే 24 ఏళ్లు యువకుడు మృతి చెందాడు. అజయ్ మృతి చెందిన రోజుకి సరిగ్గా రెండు నెలల ముందు ఊరులో అతనికి కుక్క కరిచింది. అయితే కుక్క కాటును లైట్ తీసుకున్న యువకుడు యాంటి రాబీస్ వ్యాక్సిన్ చేయించుకోకుండా నిర్లక్యం చేశాడు. దీంతో కిందటి నెల 14న ఇంటి వద్ద అజయ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు యువకుడిని వెంటనే శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు అజయ్. అయితే అజయ్ మృతి చెందిన 34 రోజులకు అనగా సోమవారం మధ్యాహ్నం బూర్జ మండలం తోటవాడకు చెందిన దనాన అప్పమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కుక్క కాటుకు మృతి చెందింది.
కిందటి నెల 27న ఒకేరోజు తోటవాడకు చెందిన అప్పమ్మతో పాటు అదే మండలంకి చెందిన అయ్యవారిపేట, అన్నంపేట కొల్లివలస, కంట్లాం గ్రామాలలో 15మందిని, రెండు ఎద్దులను పిచ్చి కుక్క కరిచింది. ఒక్క ఉదుటున అప్పమ్మపైకి ఎగిరి కన్ను పక్క భాగం అంతటిని నోటితో పట్టి పీకేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని శ్రీకాకుళం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం మళ్లీ అక్కడి నుంచి విశాఖపట్నంలోని హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయితే ఇటీవలే ఇంటిపట్టున ఉంటూ టైముకి మందులు వేసుకుంటుండగా ఆదివారం అడెన్‌గా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో శ్రీకాకుళం GGH కి తరలించారు కుటుంబసభ్యులు. దీంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అప్పమ్మ సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.
కిందటి నెల అప్పమ్మను కరిచిన పిచ్చి కుక్కే.. రెండు ఎద్దులను కూడా కరిచింది. దీంతో కొద్ది రోజులకి ఆ ఎద్దులు కూడా చనిపోయాయి. కుక్క కాటుపై ఆదివారమే TV9 తో అప్పమ్మ మాట్లాడింది. అలా మాట్లాడిన మరుసటి రోజే అప్పమ్మ మృతి చెందింది. అప్పమ్మ మృతితో మిగిలిన కుక్కకాటు బాధితులు తమ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. 2023 ఏప్రిల్‌లో జి.సిగడాం మండలం మెట్టవలసలో 18 నెలల చిన్నారిని కుక్క నోటితో కరుచుకొని సమీప తోటల్లోకి తీసుకువెళ్లి తీవ్రంగా గాయపరించింది. తరవాత తల్లిదండ్రులు చిన్నారిని రాజాం ప్రభుత్వ హాస్పిటలకి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఇలా కుక్కలు కరిచి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా వాసులు కుక్కను చూస్తే చాలు బెంబేలెత్తి పోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




