AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!

Ongole theft: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. సీసీ కెమెరాల్లో టోపీ ధరించిన అనుమానితుడు కనిపించగా, రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!
Daylight Burglaries Rock Ongole
Fairoz Baig
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 8:34 PM

Share

ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు పట్టపగలు రెండిళ్ళల్లో చోరీలకు పాల్పడి బంగారం, వెండి, నగదు అపహరించారు. తాళం వేసిన ఇళ్ళను టార్గెట్‌ చేసుకుని గంటల వ్యవధిలో రెండిళ్ళల్లో చోరీలకు పాల్పడటంతో పోలీసులు ఖంగుతిన్నారు. వెంటనే ఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఇంట్లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌ ద్వారా నిందితుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. రెండు ప్రాంతాల్లో చోరీ చేసింది సింగల్‌ ఎఫెండర్‌గానే పోలీసులు గుర్తించారు. అయితే ఈ రెండు చోరీలు చేసింది ఒకరేనా, లేక వేర్వేరు వ్యక్తులా… అన్నది పోలీసులు విచారణలో తేలనుంది. ఒంగోలులో ఒకేరోజు పట్టపగలు గంటల వ్యవధిలో రెండిళ్లల్లో చోరీ జరగడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌…

ఒంగోలులో భారీ చోరీ జరిగింది. నగరంలోని ఆంధ్రకేసరినగర్‌లో పట్టపగలు దర్జాగా ఓ తాళం వేసిన ఇంట్లోకి వెళ్ళి 30 సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళాడు దొంగ. ట్విస్ట్‌ ఎంటంటే ఇంటి యజమానులు బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా దొంగ తారసపడ్డాడు. ఎవరు అని ప్రశ్నించేలోగా పైన ఉన్న బ్యాచ్‌లర్స్‌ కోసం వచ్చానంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు దొంగ. తీరా ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి మెయిన్‌ గేటు తాళాలు, బెడ్‌రూంలో బీరువా పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించిన ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒంగోలు నగరంలో కిరాణ షాపు నిర్వహిస్తున్న ఆలపాటి సత్యానందరావు, ఆయన భార్య సుజాతలు ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో రక్త పరీక్ష(బ్లడ్ టెస్ట్)లు చేయించుకునేందుకు బయటకు వెళ్ళారు. తిరిగి 12 గంటల 45 నిమిషాలకు వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూడగా బెడ్‌రూంలో లైట్లు వేసి ఉన్నాయి. బీరువా తెరిచి ఉంది. అందులో ఉండాల్సిన బంగారు నగలు కనిపించలేదు. దీంతో బెంబేలెత్తిన ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌ టీం ఇంట్లో చోరీ చేసిన దొంగకు సంబంధించిన వేలి ముద్రల కోసం గాలించారు. పలు ఆధారాలు సేకరించారు. ఈ సందర్బంగా చోరీకి వచ్చిన దొంగ ఇంటి బయట, ఇంటి లోపల తచ్చాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. టోపీ ధరించిన ఓ వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్టు గ్రహించారు. ఇంటిపై పోర్షన్‌లో కొంతమంది బ్యాచ్‌లర్లు ఉండగా వారి కోసం వచ్చినట్టు నటిస్తూ అటూ ఇటూ తిరుగుతూ దొంగ రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. చోరీ చేసిన తరువాత బయటకు వెళుతుండగా ఇంటి యజమానురాలు సుజాత బయటి నుంచి వస్తూ ఎదురుపడి ఎవరు, ఎందుకు వచ్చావు అని ప్రశ్నించే లోపు పైన ఉన్న బ్యాచ్‌లర్స్‌ కోసం వచ్చానంటూ దొంగ అక్కడినుంచి దర్జాగా జారుకున్నాడు. ఇంట్లో పరిస్థితులను గత కొంతకాలంగా గమనించి పక్కా ప్లాన్‌ ప్రకారం ఇంటి యజమానురాలు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంట్లో 30 సవర్ల బంగారు నగలు అపహరణకు గురయ్యాయని ఇంటి యజమానురాలు సుజాత తెలిపారు.

సమతానగర్‌లో మరో చోరీ…

ఆంధ్రకేసరి నగర్‌లో పట్టపగలు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తాళం వేసిన ఇంటి తాళాలు పగులగొట్టి కిరాణా వ్యాపారి సత్యానందరావు ఇంట్లో 30 సవర్ల బంగారు నగలు ఎత్తుకెళ్ళిన ఘటన మరవకుందే గంటల వ్యవధిలో నగరంలోని సమతానగర్‌లో మరో చోరీ జరిగింది. విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ నాగరాజు ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇక్కడ కూడా ఒక్కరే ఇంటి తాళాలు పగులగొట్టి 20 సవర్ల బంగారు నగలు, 5 లక్షల నగదు ఎత్తుకెళ్ళినట్టు ఇంటి యజమాని తెలిపారు. తాను లైన్‌మెన్‌గా పనిచేస్తుండగా తన భార్య సుధారాణి కావలిలో వైద్యారోగ్యశాఖలో పనిచేస్తుండటంతో ఇంటికి తాళాలు వేసి విధుల కోసం వెళ్ళామని, సాయంత్రం తిరిగి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీ చేశారని తెలిసిందని వాపోతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ ఇంట్లోని బీరువా తాళాలు కూడా పగుల గొట్టి నగలు, నగదు ఎత్తుకెళ్ళారని చెబుతున్నారు ఇంటి యజమాని నాగరాజు.

దర్యాప్తు చేస్తున్నాం… పోలీసులు

ఒంగోలులో తాలూకా పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఒకేరోజు జరిగిన రెండు చోరీ ఘటనలతో ఉలిక్కిపడ్డ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు చోట్ల చోరీలకు పాల్పడింది ఒంటరి వ్యక్తిగానే భావిస్తున్నారు. అలాగే ఈ రెండు చోట్లా ఒకరే చోరీ చేశారా, లేక వేర్వేరు వ్యక్తులా అన్నది పరిశీలిస్తున్నారు. ముందు జరిగిన ఆంధ్రకేసరి నగర్‌లో చోరీ ఘటనలో సిసి కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో కనిపించిన టోపీ ధరించిన వ్యక్తి, సమతా నగర్‌లో జరిగిన చోరీ కేసులో కూడా పాల్గొన్నాడా..? అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఒంగోలు తాలూకా సీఐ విజయ్‌కృష్ణ తెలిపారు.

Follow Us