Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు.. ఎందుకంటే..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా జనసేన అధినేతపై కేసు నమోదైంది.

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు.. ఎందుకంటే..
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 18, 2024 | 9:24 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా జనసేన అధినేతపై కేసు నమోదైంది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతోపాటు.. మార్చి 25న గుంటూరు జిల్లా కోర్ట్‌కు హాజరు కావాలని నోటీస్‌లు ఇచ్చింది. జులై 3న ఏలూరులో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. వాలంటీర్లపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనుక వాలెంటీర్ వ్యవస్థ ఉందని పవన్ ఆరోపించినట్లు కేసులో పేర్కొన్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ పేర్కొన్నారు. వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ వ్యాఖ్యానించారు.. దీనిపై అప్పట్లోనే వాలంటీర్లతోపాటు.. వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

విశాఖలో పవన్‌ కల్యాణ్‌ రెండురోజుల పర్యటన

ఇదిలాఉంటే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ దూకుడు పెంచారు.. ఇవాళ, రేపు విశాఖలో పర్యటిస్తారు పవన్. మధ్యాహ్నం 2.30గంటలకు విశాఖ చేరుకోనున్నారు పవన్‌ కల్యాణ్. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తలతో పవన్‌ భేటీ కానున్నారు. వన్‌ టూ వన్‌ చర్చిస్తారని సమాచారం. ఆశావహులు, పొత్తులో పోటీ చేసే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలతో పాటు ఎన్నికల కార్యాచరణను నేతలతో చర్చిస్తారు పవన్.. ఇప్పటికే, టీడీపీ అధినేత చంద్రబాబుతో సీట్ల విషయంపై పవన్ కల్యాణ్ చర్చించారు.. ఆ దిశగా.. పవన్ జనసేన శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో భేటీ కానున్న పవన్ కల్యాణ్.. పోటీ చేసే సీట్లపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..