Andhra Pradesh: ప్రధాని మోదీకి జైకొడితే రాత్రికి రాత్రే కేసులు మాయం.. సంచలన కామెంట్స్ చేసిన నారాయణ..
తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ రాజకీయ వ్యూహాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ రాజకీయ వ్యూహాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో బీజేపీకి వైసీపీ మద్ధతు, తెలంగాణలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. గురువారం నాడు మీడియాతో ముందుకొచ్చిన నారాయణ.. కేంద్రాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు, పార్టీలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయని అన్నారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తుందనే టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తోందన్నారు.
అదే ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడితే రాత్రికి రాత్రే ఎవరి కేసులైనా మాయం అవుతాయని అన్నారు. మోదీకి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే ఇప్పుడు పెడుతున్న కేసులన్నీ రద్దయిపోతాయని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం ఏకపక్ష దాడులు చేస్తోందని దుయ్యబట్టారాయన. మద్దతిస్తే ఒకలా.. వ్యతిరేకిస్తే మరోలా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. టీఎంసీ నుంచి శారద, నారద నిందితులు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న కేసులన్నీ మాయం అయ్యాయని గుర్తు చేశారు నారాయణ.
ఏపీ రాజకీయాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు నారాయణ. ఆంధ్రలో వైసీపీ గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని అన్నారు. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాలని పిలుపునిచ్చారు నారాయణ. వైసీపీ, బీజేపీ రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారాయణ చేసిన కామెంట్స్ మరింత హీట్‌ను పెంచాయి. వైసీపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందని నారాయణ వ్యాఖ్యలను గమనిస్తే అర్థం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..