Andhra Pradesh: చాలాకాలం తర్వాత పత్తి రైతు కళ్లల్లో ఆనందం.. దేశ చరిత్రలోనే పత్తికి రికార్డు ధర
చాలాకాలం తర్వాత పత్తి రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే పత్తికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ పత్తి ధర 11వేల రూపాయల పలికి ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
పత్తి రైతుల కంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా కాలం తర్వాత పంటకు సరైన ధర పలకడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా క్వింటాల్ పత్తి ధర ఏకంగా 11 వేల 111 రూపాయలు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. పత్తికి పెరిగిన డిమాండ్‌తో వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేస్తుండడం రైతులకు కలిసొస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరగడంతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. నాణ్యమైన పత్తిని ఎంత ధరైనా పెట్టి కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పత్తి సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో పత్తికి కొరత ఏర్పడింది. పత్తికి ఉన్న డిమాండ్.. అటు ఉత్పత్తి తగ్గడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. కర్నూలు జిల్లా(Kurnool District) ఆధోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోలు వ్యాపారులు పోటీపడ్డారు. ఏకంగా క్వింటాల్ పత్తికి 11 వేల 111 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంత భారీస్థాయిలో పత్తి అమ్ముడవడంపై రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదోని(Adoni) పరిసర ప్రాంతాల్లో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. దూది భేళాల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కు రాకపోవడంతో వ్యాపారులు పత్తికోసం పోటీపడుతున్నారు. ఇన్నాళ్లూ కనీస మద్దతు ధర దొరక్క.. పెట్టిన పెట్టుబడి కూడా రాక పత్తి రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ సారిమాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా మారి.. ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ఏదిఏమైనా చాలా కాలం తర్వాత కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంపై పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పెన్షన్ పేరులో వృద్ధురాలిని మోసం చేసిన గ్రామ వాలంటీర్.. ఆస్తికే ఎసరు.. సినిమాను మించిన ట్విస్టులు