Congress: స్వాత్రంత్యోద్యమంలో ప్రమేయమే లేని బీజేపీ నేడు చరిత్రను వక్రీకరిస్తోంది.. కేవీపీ సంచలన కామెంట్స్..
Congress: భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రమేయమే లేని బీజేపీ నేడు చరిత్రను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ఫైర్..
Congress: భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రమేయమే లేని బీజేపీ నేడు చరిత్రను పూర్తిగా వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. క్విట్ ఇండియా ఉద్యమంలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారని, అనేక మంది జైలుపాలయ్యారని తెలిపారు. కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ చరిత్రను వక్రీకరించేలా వ్యవహరిస్తోందన్నారు. ఆ రోజుల్లోనే ఆగర్భ శ్రీమంతుడైన జవహార్‌లాల్ నెహ్రూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో పదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించారని పేర్కొన్నారు కేవీపీ. రాజభోగాలు అనుభవించిన వ్యక్తి, సత్యాగ్రహంలో భాగంగా జైల్లో మగ్గారని అన్నారు. అలాంటి నెహ్రూ చరిత్రను కర్ణాటక పాఠ్యపుస్తకాల నుంచి, క్విట్ ఇండియా ఉద్యమం నుంచి తొలగించడం దారుణం అన్నారు.
నెహ్రూ ఒక్కరే జైలుకు వెళ్లారా అన్న ప్రశ్న కొంతమంది లేవనెత్తుతున్నారని, ఆయనతో పాటు అనేకమంది జైలుకెల్లారని, ఆస్తులను త్యాగం చేశారని, వారందరినీ కూడా స్మరించుకుందామన్నారు కేవీపీ. క్విట్ ఇండియా ఉద్యమంలో నేటి పాలక పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏముంది? అని ప్రశ్నించారు కేవీపీ. ఆనాటికి హెడ్గేవార్, దీన్ దయాళ ఉపాధ్యాయ తదితరులు అందరూ ఉన్నారని, కానీ వారి పాత్ర ఏముంది? అని ప్రశ్నించారు. వీరు బ్రిటీష్ వారితో కుమ్మక్కై భారతదేశాన్ని విభజించే కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు కేవీపీ.
ఇదే సమయంలో తెలంగాణ సాయుధ పోరాటంపైనా కేవీపీ స్పందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను విస్మరించలేమన్నారు. సైద్ధాంతికంగా తమకు విభేదాలు ఉన్నా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించిన విషయంలో వారి పాత్రను ఎవరూ విస్మరించలేరన్నారు. అందుకే నెహ్రూ ప్రధాని అవగానే రావి నారాయణరెడ్డి తదితర నేతల పాత్రను గుర్తిస్తూ వారిని కలిశారన్నారు. కానీ, చరిత్రను పక్కదోవ పట్టించేలా చెప్పడంలో నేటీ బీజేపీ ముందుందని విమర్శించారు కేవీపీ. ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ అమలు చేసిన వేర్పాటువాద, అతివాద విధానాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయని దుయ్యబట్టారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా త్యాగాలు చేసిన వ్యక్తే అని అన్నారు. ఆయన కాంగ్రెస్ తో విభేదించి ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ప్రజలు కాంగ్రెస్ వాదానికే మద్దతు పలికారని గుర్తు చేశారు. సైద్ధాంతిక పోరాటాలు పోయి కులాలు, మతాలు, స్వార్థం ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతి ఇంట్లో ఉన్న సమస్యను రాహుల్ గాంధీ తన ‘హల్లా బోల్’ ర్యాలీలో వినిపించారని కేవీపీ పేర్కొన్నారు. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎవరి కోసం జరుగుతుందో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. భారత్ జోడో యాత్ర – క్విట్ ఇండియా స్ఫూర్తిని దేశంలో మరోసారి తీసుకొస్తుందన్నారు. కుల, మత బేధాలు లేని సమాజం, భారతీయులందరూ ఒక్కటేనన్న నినాదంతో రాహుల్ ముందడుగు వేస్తున్నారని చెప్పారు కేవీపీ. రాహుల్ తన నానమ్మ (ఇందిర) హత్యను కళ్లారా చూశారని, తర్వాత తన తండ్రి మృతదేహాన్ని చూశారన్నారు. అలాంటి వ్యక్తి.. దేశ ప్రజల కోసం నెహ్రూ సోషలిస్టు సిద్ధాంతంతో జనం కోసం యాత్రను చేపట్టారని కొనియాడారు. ప్రాంతీయ అసమానతలను, కులమత విద్వేషాలను తగ్గిస్తూ రాహుల్ యాత్ర ముందుకు సాగుతుందని చెప్పారు రామచంద్రారావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..