AP Degree Admissions 2025: ఆఫ్‌లైన్‌లోనా.. ఆన్‌లైన్‌లోనా..? డిగ్రీ ప్రవేశాలపై ఎటూ తేల్చని సర్కార్..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ప్రవేశాల కౌన్సెలింగ్ విధానంపై ఉన్నత విద్యామండలి ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం..

అమరావతి, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ప్రవేశాల కౌన్సెలింగ్ విధానంపై ఉన్నత విద్యామండలి ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం లేదు. ఆన్‌లైన్ ద్వారానా లేదంటే ఆఫ్‌లైన్‌లో చేపట్టాలా అనే విషయంపై తర్జనభర్జన పడుతుంది. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుండగా.. ప్రస్తుతం మాత్రం పెండింగ్‌లో ఉంది. ఆఫ్‌లైన్‌లోనే సీట్ల భర్తీ చేపట్టాలని కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సంస్థ ఎంపిక విధానం కూడా వాయిదా పడింది.
నిజానికి ఈ ఏడాది కూడా విద్యార్థుల రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపునకు నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్ సంస్థను ఉన్నత విద్యామండలి ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సాఫ్ట్‌వేర్ సంస్థ ఎంపికకు టెండరు ప్రకటన కూడా ఇచ్చింది. సరిగ్గా ఫైనాన్స్ బిడ్లు తెరిచే సమయంలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌పై నోట్ కోరడంతో ఈ ప్రక్రియను ఉన్నత విద్యామండలి నిలిపివేసింది. ఇందుకు సంబంధించి జూన్ 7న ఉన్నత విద్యాశాఖకు నోట్ పంపించినప్పటికీ.. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు.
2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలు తీసుకొచ్చారు. విద్యార్థులు కోర్సు, కాలేజీ ఎంపిక చేసుకుంటే ఇంటర్‌లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించేవారు. అయితే 2023లో కన్వీనర్ కోటాలో 70 శాతం, యాజమాన్య కోటాలో 30 శాతంగా సీట్ల భర్తీని విభజించారు. కన్వీనర్ కోటాలో చేరేవారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుండగా.. యాజమాన్య కోటాలో చేరే విద్యార్థులు మాత్రం సొంతంగా ఫీజులు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ విధానం వల్ల కచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. అయితే ఆన్‌లైన్ విధానంలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదని, విద్యార్థులకు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో కాలేజీలు కేటాయిస్తున్నట్లు యాజమన్యాలు చెబుతున్నాయి. పైగా ఆఫ్‌లైన్‌లో సీట్లు భర్తీ చేసినా 70 శాతానికి మించి సీట్లు నిండవని కాలేజీల యాజమన్యాలు చెబుతున్నాయి. ఆఫ్‌లైన్ విధానం వల్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలపై ప్రభావం పడుతుందని ప్రభుత్వ లెక్చరర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం ప్రకటించవల్సి ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




