AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్‌!

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల అస్థిరత, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాలతో స్థానిక కరెన్సీల్లో చమురు వాణిజ్యాన్ని విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే యూఏఈతో రూపాయి-దిర్హమ్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇది దిగుమతి వ్యయాలను నియంత్రించి, ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు, రూపాయి అంతర్జాతీయ వినియోగాన్ని పెంచుతుంది.

అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్‌!
Pm Modi And Donald Trump
SN Pasha
|

Updated on: Mar 19, 2026 | 7:00 AM

Share

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో, భారతదేశం కీలక వ్యూహాత్మక నిర్ణయానికి సిద్ధమవుతోంది. దిగుమతి వ్యయాలను నియంత్రించడంతో పాటు, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గల్ఫ్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ (GCC)లో భాగమైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు భారత్‌కు ప్రధాన చమురు సరఫరాదారులు. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతుండగా, అందులో దాదాపు 28 శాతం GCC దేశాల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగితే, దిగుమతి బిల్లు పెరగడం, వాణిజ్య లోటు విస్తరించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 70 నుంచి 110 డాలర్ల మధ్య మారుతూ ఉండటం, సరఫరా అంతరాయాలపై భయాన్ని మరింత పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో డాలర్ ద్వారా చెల్లింపులు చేయడం వల్ల కరెన్సీ మార్పిడి ఖర్చులు అధికమవుతున్నాయి. రూపాయి బలహీనత కూడా దిగుమతులను మరింత ఖరీదైనవిగా మారుస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేసే విధానాన్ని విస్తరించాలనే దిశగా భారత్ ముందుకెళ్తోంది. ఇప్పటికే ఇండియా, యూఏఈ మధ్య 2022లో కుదిరిన CEPA ఒప్పందం తరువాత, 2023లో స్థానిక కరెన్సీ సెటిల్‌మెంట్ (LCS) వ్యవస్థను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రూపాయి, దిర్హమ్‌లలో నేరుగా చెల్లింపులు జరపడం సాధ్యమవుతోంది, తద్వారా మారకపు రేటు ప్రమాదం తగ్గి, లావాదేవీ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.

అధికారుల ప్రకారం డాలర్ కొరత ప్రస్తుతం పెద్ద సమస్య కాకపోయినా, భవిష్యత్తులో అనిశ్చితులను ఎదుర్కొనేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. మొత్తంగా గ్లోబల్ అస్థిరత మధ్య భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడే దిశగా కీలకంగా మారనున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us