YS Jagan: రాప్తాడు సభకు సర్వం ‘సిద్ధం’.. మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్..! హైదరాబాద్-బెంగళూరు హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ కేడర్‌తో కలిసి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలకు వైసీపీ కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. తాజాగా.. రాయలసీమలో అన్ని రహదారులు రాప్తాడుకు దారి తీస్తున్నాయి. ఇవాళ అక్కడ జరగనున్న వైసీపీ సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారా? కొత్త హామీలు ప్రకటించబోతున్నారా? ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉందా? ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారా?
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ కేడర్‌తో కలిసి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలకు వైసీపీ కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. ఇక ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం సభకు రంగం సిద్ధమైంది. భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడు సభకు కార్యకర్తలు పోటెత్తుతారని వైసీపీ అంచనా వేస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. జరగబోయే ఎన్నికల సంగ్రామానికి కేడర్‌ను సంసిద్ధం చేయడంతో పాటు వారికి దిశానిర్దేశం చేస్తారు జగన్..
హైదరాబాద్-బెంగళూరు హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు..
రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు దగ్గర సుమారు 250 ఎకరాల మైదానంలో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికపై 300 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తల కోసం 100 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలను కల్యాణదుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవేపై వెళ్లవచ్చు.
ఎన్నికల హామీలపై కీలక ప్రకటన!
అయితే రాప్తాడు సిద్ధం సభ రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భీమిలి, దెందులూరు సభలకు భిన్నంగా రాప్తాడు సభ ఉండబోతోందంటున్నారు. ఈ సభలో ఎన్నికల హామీలకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ కొత్త ఎన్నికల హామీలు ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. రైతు రుణమాఫీ లాంటివి ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రాప్తాడు సభలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్….ఎలాంటి హామీలు, వరాలు ప్రకటిస్తారా అని రాజకీయ వర్గాలతో పాటు ఏపీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బీసీలపై వరాల జల్లు కురిపించడంతో పాటు మహిళలు స్వయంశక్తితో ఎదిగేలా ఓ కొత్త పథకం ప్రకటిస్తారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూడా ఓ హామీ ఇవ్వబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే.. సభకు ముందు మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు..
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతోంది వైసీపీ. ఈ నేపథ్యంలో రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ ఏం చెబుతారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..