CM YS Jagan: అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన వైసీపీ.. రెండో జాబితా ప్రకటన ఎప్పుడంటే..

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే టీమ్ ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత పదిరోజులుగా ఇంచార్జీల మార్పు, కొత్తవారి నియామకంపై కార్యాచరణను వేగవంతం చేసారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసేలా 175 సీట్లు టార్గెట్‎గా ముందుకెళ్తున్నారు.

CM YS Jagan: అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన వైసీపీ.. రెండో జాబితా ప్రకటన ఎప్పుడంటే..
CM Jagan
Follow us
S Haseena

| Edited By: Srikar T

Updated on: Dec 20, 2023 | 4:31 PM

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే టీమ్ ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత పదిరోజులుగా ఇంచార్జీల మార్పు, కొత్తవారి నియామకంపై కార్యాచరణను వేగవంతం చేసారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసేలా 175 సీట్లు టార్గెట్‎గా ముందుకెళ్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం వై నాట్ 175 అంటూ ముందుకెళ్తున్న సీఎం.. దానికి తగ్గట్టుగా కొత్త టీంను ఎంచుకునే ప‌నిలో ప‌డ్డారు. సీటు కోల్పోతున్న వారిని తాడేప‌ల్లికి పిలిపించి వారితో మాట్లాడుతున్నారు. గ్రాఫ్ బాగోలేని చోట పోటీ చేసినా ప్రయోజనం లేద‌ని చెబుతున్నారు. సీటు రాని వారి రాజ‌కీయ భ‌విష్యత్తుకు నాది గ్యారంటీ అంటున్నారు సీఎం జ‌గ‌న్.

వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో సీఎం జ‌గ‌న్ తుది నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిక‌ల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక‌పై సీఎం జ‌గ‌న్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇప్పటికే 11 మంది ఇంచార్జిలను మార్పు చేసిన వైసీపీ బాస్.. రెండో జాబితా సిద్దం చేసే ప‌నిలో ప‌డ్డారు. నిన్న, ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను తాడేప‌ల్లికి పిలిచారు. వీరంతా సీటు కోల్పోతున్న వారే కావ‌డం విశేషం. సీటు ఎందుకు ఇవ్వడం లేదు.. వారికి స్థానికంగా ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయి అనే అంశాల‌ను పార్టీ పెద్దలు వివ‌రిస్తున్నారు.

గ‌డ‌ప గ‌డ‌పకు మ‌న ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి వచ్చిన స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా వారి సీట్లపై నిర్ణయం తీసుకుంటున్నారు. గ‌తంలో గ‌డ‌ప గ‌డ‌పకు మ‌న ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం క్యాంప్ ఆఫీస్‎లో వ‌ర్క్ షాప్‎లు నిర్వహించిన స‌మ‌యంలోనే కొంత‌మందికి వార్నింగ్ ఇస్తూ వ‌చ్చారు వైసీపీ అధినేత. స్థానికంగా ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలు, పార్టీ కేడ‌ర్‎తో ఉన్న సంబంధాలు వంటి అంశాల‌ను ఎమ్మెల్యేల‌కు వివ‌రిస్తున్నారు. రెండు రోజుల్లో సుమారు 20 మంది ఎమ్మెల్యేల‌కు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది. వీరంతా సీఎం జ‌గ‌న్‎తో వేర్వేరుగా భేటీ అయ్యారు. కొంత‌మంది ఎమ్మెల్యేల‌కు అస‌లు సీటు లేద‌ని చెప్తుంటే మ‌రికొంత‌మందిని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు మార్పులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల‌తో పాటు కొంత‌మంది ఎంపీలు కూడా సీఎం జగన్‎ను క‌లిసిన వారిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సీటు దక్కని వారు.. వేరే చోట‌కు వెళ్తున్న వారి లిస్ట్ ఇదే

ఫస్ట్ లిస్ట్‎లో 11 మంది గుంటూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది వైఎస్సార్సీపీ అధిష్టానం. ఇపుడు ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు. మరో వైపు రాయలసీమ నేతల లిస్ట్ కూడా కసరత్తు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఒక్కొక్క ఎమ్మెల్యే‎కి ఫోన్‎లు చేసి పిలిపించి వారితో స్థానిక స‌మీక‌ర‌ణాల గురించి మాట్లాడుతున్నారు. ఎంత పెద్ద లీడర్ అయిన పార్టీ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి వుండాల్సిందే అని స్పష్టం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటి వరకు సీఎంని కలసిన వారిలో టిక్కెట్ లేద‌ని కొంత‌మందికి చెప్పేసారు. వారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పరవత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాల‌ గిరిధ‌ర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు ఉన్నారు.

ఇక మార్పులు చేర్పులు చూస్తే పత్తిపాడుకు వ‌రుపుల సుబ్బారావును, రాజ‌మండ్రి రూర‌ల్‎కు మంత్రి వేణుగోపాల్‎ను పంపించ‌నున్నట్లు తెలిసింది. రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‎ను రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. కాకినాడ ఎంపీ వంగా గీత‌ను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఎంపిక చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అమ‌లాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్‎ను పి.గన్నవరం లేదా పాయ‌క‌రావు పేట నుంచి బ‌రిలో దింపే అవకాశం ఉంది. రాజోలు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్రసాద్‎ను అమ‌లాపురం ఎంపీగా పంపించే ఆలోచ‌న‌లో ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే రాపాకతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కూడా సీఎంను క‌లిశారు.

రాయ‌ల‌సీమ అభ్యర్థులపైనా ఫోక‌స్ పెట్టిన అధినేత‌

మ‌రోవైపు రాయ‌ల‌సీమకు చెందిన కొంత‌మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను క‌లిసారు..వీరిలో మంత్రి గుమ్మనూరు జ‌యరాం, మాజీ మంత్రి శంక‌ర నారాయ‌ణ ఉన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామి రెడ్డి కూడా సీఎంను క‌లిసారు. రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డికి కూడా సీటు ఇవ్వడం లేద‌ని తెల‌సింది. ఈయ‌న కూడా సీఎం కార్యాల‌యానికి వ‌చ్చి జ‌గ‌న్‎ను క‌లిసారు. రేప‌టి లోగా మ‌రో లిస్ట్ సిద్దం చేయ‌వ‌చ్చని తెలిసింది. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సీఎం అభ్యర్ధుల ఎంపిక ప‌నిలోనే ఉంటున్నారు. సీఎంతో భేటీ త‌ర్వాత చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయమే ఫైన‌ల్ అని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..