ముద్రగడ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వైసీపీ నేతలతో చర్చలు పూర్తయ్యాయా?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? చర్చలతో పాటు సీటు కూడా ఖరారైందా? మరో రెండు రోజుల్లోనే వైసీపీలో చేరడం ఖాయమేనా? ఇంతకీ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం ఊపందుకుంది. గతంలో ఎప్పటినుంచో ఆయన చేరికపై వార్తలు వస్తున్నా.. లేటెస్ట్‌గా ముద్రగడ చేరికకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనాలని ముద్రగడ బలంగా కోరుకుంటున్నట్టు సమాచారం. ఆయన వైసీపీలో చేరి పోటీ చేస్తారా? లేదంటే కుమారుడికి టిక్కెట్ అడుగుతారా? అన్నది తేలాల్సి ఉంది. పార్టీ హైకమాండ్ ముద్రగడకు పెద్దాపురం సీటును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తోట నరసింహం సతీమణి పోటీ చేశారు. ఈసారి తోట నరసింహానికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ముద్రగడ వైసీపీలో చేరడం.. ఆ తర్వాత పోటీ చేయడం కూడా ఖాయమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
కాపు రిజర్వేషన్ల ఉద్యమ కర్తగా ముద్రగడ వ్యవహరించారు. గతంలో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన పెద్దగా యాక్టివ్ కాలేదు. టీడీపీ – జనసేన పొత్తుల కారణంగా కాపు ఓటు బ్యాంక్ చెదిరి పోకుండా ముద్రగడను వైసీపీలో చేర్చుకోవాలని భావించారు. గతంలో పవన్ వారాహి యాత్రలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేసినప్పుడు ముద్రగడ.. పవన్ పై విరుచుకుపడ్డారు. అప్పుడే ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.
ముద్రగడ పార్టీలో చేరి మరిన్ని సేవలు చేయొచ్చంటూ మంత్రి వేణుగోపాల్ చెప్పడం.. చేరిక ఖాయమన్న ప్రచారం మరింత జోరందుకుంది. నిజానికి వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్న సీఎం జగన్.. వైసీపీ ఇన్‌చార్జ్‌లను మారుస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. తన కన్నా.. తన కుమారుడు చల్లారావు భవిష్యత్ కోసం అధికార పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై పలువురు వైసీపీ నేతలతో ముద్రగడ చర్చలు కూడా జరిపారట. తన కుమారుడి భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ఇదే సరైన సమయమని.. ఇందుకు సంబంధించి క్లారిటీ వస్తే చేరిక దాదాపు ఖరారైనట్టేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..