Punganur Cow Breed: సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం.. ఈ జాతి ఆవు పాలకు మార్కెట్లో యమ గిరాకీ
దేశంలోనే తొలిసారిగా సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మేలు జాతి పుంగనూరు కోడెదూడ జన్మించింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని శెట్టిగుంటలో ఓ నాటు ఆవుకు పశువైద్యులు ప్రసవం చేయగా పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో చింతలదీవి పశుక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయసున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని శెట్టిగుంట గ్రామంలో రైతు హరికి చెందిన నాటు ఆవు గర్భంలో..
కోడూరు, డిసెంబర్ 20: దేశంలోనే తొలిసారిగా సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మేలు జాతి పుంగనూరు కోడెదూడ జన్మించింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని శెట్టిగుంటలో ఓ నాటు ఆవుకు పశువైద్యులు ప్రసవం చేయగా పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో చింతలదీవి పశుక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయసున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని శెట్టిగుంట గ్రామంలో రైతు హరికి చెందిన నాటు ఆవు గర్భంలో ఈ ఏడాది మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మే 25వ తేదీన ఆ ఆవు చూలు కట్టినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరీఫ్ నిర్థారించారు. చూలు సమయంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు.
నెలలు నిండిన ఆవు ఆదివారం (డిసెంబర్ 17) రాత్రి పుంగనూరు జాతి కోడెదూడకు జన్మనిచ్చినట్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించిన డాక్టర్ ప్రతాప్ మీడియాకు తెలిపారు. జన్మించిన కోడదూడ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానం ద్వారా పుంగనూరు కోడెదూడ జన్మించడం దేశంలోనే తొలిసారని డాక్టర్ ప్రతాప్ అన్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల ఖర్చుతో పిండమార్పిడి విధానం ద్వారా మనకు కావాల్సిన పశువుల సంతతి వృద్ధి చేసుకోవచ్చని ఆయన వివరించారు.
పుంగనూరు జాతి ఆవుల ప్రత్యేకత అదే..
పుంగనూరు జాతి ఆవులు ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవులు. ఇవి పరిమాణంలో సాధారణ ఆవులకంటే చాలా చిన్నగా ఉంటాయి. అవి కేవలం 3 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. ఈ జాతి ఆవులు కేవలం 180 నుంచి 200 వరకు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. ఈ బ్రీడ్ ఆవులను సంరక్షించేందుకు పాడి పరిశ్రమ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పుంగనూరు జాతి ఆవు పాలు ఒక్క లీటర్ రూ.300 వరకు ధర పలుకుతుంది. ఈ అరుదైన జాతి ఆవులు ఒక్కొక్కటి రూ.20 లక్షల వరకు అమ్ముడుపోతాయి. చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే గడ్డి తిని.. రోజుకు రూ.3 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.
గతేడాది తొలిసారిగా సరోగసీ ద్వారా సాహివాల్ దూడకు జన్మనిచ్చిన ఆవు..
గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాలలో మేలు జాతి ఆవుల అండాలు సేకరించి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారు. అనంతరం టీటీడీ గోసాలలోని ఆవుల గర్భాశయంలో ప్రవేశపెట్టారు. అలా దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు ఒంగోలు జాతి ఆవు జన్మనిచ్చింది. ఇక ఈ ఏడాది ఓ రైతుకి చెందిన నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనిచ్చేలా చేశారు. మేలుజాతి దేశీ ఆవుల సంతతిని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.