Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పచ్చని పంటలపై రాజకీయ చీడ.. నేలకొరుగుతున్న మిర్చి తోటలు..

ఈ ఏడాది మొదట వర్షాభావంతో పంటలు సరిగా పెరగలేదు. అయితే, మధ్యలో పడిన వర్షాలతో మిర్చి పంట దిగుబడి బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఎకరానికి నలభై క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మిర్చి ధర కూడా ఆశాజనకంగా ఉంది. దీంతో వెంకటేశ్వర్లకు అధిక ఆదాయం వస్తుందనుకున్న ప్రత్యర్ధులు ఏకంగా మిర్చి చెట్లను పీకేశారు.

Andhra Pradesh: పచ్చని పంటలపై రాజకీయ చీడ.. నేలకొరుగుతున్న మిర్చి తోటలు..
Ap News
Follow us
T Nagaraju

| Edited By: Venkata Chari

Updated on: Dec 20, 2023 | 10:56 AM

Andhra Pradesh: పల్నాడంటేనే గుర్తుకొచ్చేది పగ, ప్రతీకారం.. ఒకప్పుడు పల్నాడులోని అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి. వర్గ పోరుతో రాజకీయాలు మిలాఖత్ అవటంతో దాడులు, హత్యలు చోటుచేసుకునేవి. అయితే, గత కొంతకాలంగా పల్నాడులో ఫ్యాక్షనిజం తగ్గిపోయింది. అభివృద్ధి చెందడంతో పాటు విద్యకు ప్రాధాన్యత పెరగడంతో ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గుముఖం పట్టాయి.

అయితే, తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు తిరిగి ప్యాక్షనిజం మొదలవుతుందేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగదాల్లో భాగంగా చీని చెట్లను నరికి వేస్తున్నారు. ప్రత్యర్ధులకు ఆర్ధికంగా నష్టం చేయాలన్న దురుద్దేశంతోనే చీని చెట్లను నరికివేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ పల్నాడులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.

రాత్రి వినుకొండ మండలం నడిగడ్డలో మిర్చి పంటను ధ్వంసం చేసిన దుండగులు ఏకంగా ఒక పార్టీకి చెందిన జెండాలను పాతటం కలకలం రేపింది. నడిగడ్డ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న వెంకటేశ్వర్లు కోర్టు పనులు నిమిత్తం సిటీకి వెళ్లాడు. అతని కొడుకు అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లాడు. ఈక్రమంలోనే రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లు మిర్చి పొలానికి వెళ్లారు. ఏపుగా పెరిగి కాపుకొచ్చిన మిర్చి తోటలోని చెట్లను ధ్వంసం చేసి, పీకి పడేశారు. ఆర్థికంగా నష్టం జరిగిందని భావించిన తర్వాత అక్కడ నుంచి చిన్నగా జారుకున్నారు. అయితే, ధ్వంసం చేసిన మొక్కల మధ్య అధికార పార్టీ జెండాలుండటంతో రాజకీయ కక్ష్యలతోనే మిర్చి పంటను ధ్వసం చేసి ఉంటారన్న భావన వ్యక్తం అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా ప్రత్యర్ధులే ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది మొదట వర్షాభావంతో పంటలు సరిగా పెరగలేదు. అయితే, మధ్యలో పడిన వర్షాలతో మిర్చి పంట దిగుబడి బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఎకరానికి నలభై క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మిర్చి ధర కూడా ఆశాజనకంగా ఉంది. దీంతో వెంకటేశ్వర్లకు అధిక ఆదాయం వస్తుందనుకున్న ప్రత్యర్ధులు ఏకంగా మిర్చి చెట్లను పీకేశారు. కాగా, రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..