CM Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదంపై సీఎం జగన్ రియాక్షన్ ఇదే
పేదలకు మంచి జరిగేందుకు సంక్షేమ పథకాలు, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం పాటిస్తూ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. తన పాలనలో రైతుల పంటలకు ఎంఎస్పీకి మించిన ధర అందుతుందన్నారు. బొబ్బిలి, పాయకరావు పేట, ఏలూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్.. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బొబ్బిలి నుంచి ఏలూరు వరకు.. సీఎం జగన్ ఏ సభ చూసినా జనసందోహమే. చేతిలో జెండా పట్టి, నెత్తిన టోపి పెట్టి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం.. సీఎం జగన్‌కు మద్దతు పలికారు. రాష్ట్రంలో 90శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, వీళ్లందరికీ పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ గెలవాలన్నారు సీఎం జగన్. జనాభాలో 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, 93 శాతం విద్యార్థులకు వసతిదీనెన, విద్యాదీవెన అందుతున్నాయి. పొదుపు సంఘాల్లో కోటి 5 లక్షల మంది మహిళలు పేదలు కాదా అని ప్రశ్నించిన సీఎం.. వీళ్లందరికి పథకాలు అందాలా? వద్దా అని ప్రశ్నించారు.
అంతకుముందు పాయకరావు పేట సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రధానంగా ప్రస్తావించారు జగన్. విపక్షాలు చేస్తున్నదంతా అబద్దపు ప్రచారమని.. ఎవరి భూముల మీద వారికి సర్వహక్కులూ కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కారణంగానే చంద్రబాబుకి వైసీపీపై కోపం వస్తుందన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట పంపిణీ చేశామన్న జగన్.. ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. మహిళల రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌ల ఏర్పాటుతో పాటు దిశ యాప్ తీసుకొచ్చామన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టం తీసుకొచ్చామన్నారు. అవ్వాతాతలకు ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్ ఆపించి, తాను ఆపించినట్లు దుష్ర్పచారం చేస్తున్నారని కూటమిపై సీఎం జగన్ మండిపడ్డారు.
అంతకు ముందు విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్.. చంద్రబాబు తన జీవితకాలంలో ఏ రోజూ పేదలకు మంచి చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ కొత్త కొత్త మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. సీఎం జగన్ సభలతో కేడర్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..