Chandrababu: కుప్పం రెండు రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!

కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సంధర్భంగా ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు.

Chandrababu: కుప్పం రెండు రోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!
Cm Chandrababu On Swarna Kuppam Vision
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Jan 06, 2025 | 5:42 PM

రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పం నియోజకవర్గానికి మాత్రం ఎమ్మెల్యేనే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్ స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్ధేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం(జనవరి 6) ఆవిష్కరించారు. ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోవసారి కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే కుప్పం విజన్ 2029లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ నియమించి కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుప్పంలో ఉన్న 65 వేల కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా, ఇంటికో ఇంటికి పారిశ్రామికవేత్తను తయారుచేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాల కల్పన,100 శాతం సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్ పోర్టు పూర్తిచేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100 శాతం మరుగుదొడ్లు నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆస్పత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్, టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్ధిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ – 2029 రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

నాడు విజన్-2020 అని నినాదం ఇస్తే కొంతమంది హేళన చేశారన్న చంద్రబాబు.. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక, రాళ్లు, రప్పలు ఉన్న సైబరాబాద్ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసి హై టెక్ సిటీ నిర్మించానన్నారు. నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిదేమీ లేదు. మనమంతా సమిష్టిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు చంద్రబాబు. మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. మన తెలుగుబిడ్డ పీవీ. నరసింహారావు ప్రధానిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న చంద్రబాబు. జూన్ లోగా హంద్రినీవా జలాలను పాలారు వాగుకు తీసుకొస్తామన్నారు. నీటి భద్రత, కరవు నివారణ కోసం గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామని, టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టానన్నారు. స్వచ్చాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నామని, భవిష్యత్ లో డీప్ టెక్నాలజీ దే హవా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి 150 సేవలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోందన్న సీఎం.. ఏపీ జనాభా గ్రోత్ రేట్ 1.5 % .దక్షణ కొరియా 0.5% గా ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిచ్చి కుప్పం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రణాళికలను వివరించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..