చేపల చెరువులకు పొంచి ఉన్న ముప్పు.. రైతులు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి!
వర్షాకాలంలో వాతావరణ మార్పులు చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. భారీ వర్షాల వల్ల నీటి నాణ్యత, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, చేపలు ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఆక్సిజన్ పెంచే చర్యలు తీసుకోవడం, సున్నం, జియోలైట్ వంటివి వాడటం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. అయితే, వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాలు, ఒక్కసారిగా పెరిగే నీటిమట్టం, నీటి నాణ్యతలో మార్పులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు చేపల పెంపకదారులకు సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో చేపల చెరువుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలకృష్ణ సూచిస్తున్నారు. వర్షాకాలంలో చేపల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి నాణ్యతను ఎలా కాపాడుకోవాలి, చేపలకు వచ్చే వ్యాధులను ముందుగానే ఎలా గుర్తించాలి అనే విషయాలపై ఆయన అందించిన మెళకువలను పరిశీలిద్దాం.
వర్షాకాలంలో ఎదురయ్యే సవాళ్లు:
వర్షాలు కురిసే సమయంలో చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో నీటిమట్టం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో చెరువులోని నీటి నాణ్యత, పీహెచ్ స్థాయి, ఆక్సిజన్ పరిమాణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారీ వర్షాల తర్వాత నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే చేపలు నీటి పైభాగానికి వచ్చి గాలి కోసం తంటాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండి, ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారి మబ్బులుగా ఏర్పడి అత్యధిక వర్షం కురిసినప్పుడు లేదా వరుసగా రెండు మూడు రోజుల పాటు మబ్బులుగా ఉండి వర్షం కురుస్తున్నప్పుడు చెరువుల్లో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది.
ఈ పరిస్థితుల్లో నీటిలో సహజ మేత (ప్లాంక్టాన్) హఠాత్తుగా చనిపోవడం వల్ల (ప్లాంక్టాన్ క్రాష్) నీటి గుణాల్లో మార్పులు, ముఖ్యంగా పీహెచ్ ఒక్కసారిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల చేపలు అత్యధికంగా ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడి అధిక సంఖ్యలో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మబ్బులుగా ఉండి వర్షం కురుస్తున్నప్పుడు సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ (డిసాల్వ్డ్ ఆక్సిజన్ – DO) లోటు ఏర్పడుతుంది. రాత్రిపూట గాని, తెల్లవారుజామున గాని అధిక సంఖ్యలో చేపలు చనిపోవడం గమనించవచ్చు. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం రెండు పీపీఎం కన్నా తగ్గినట్లయితే చేపలు ఒక్కసారిగా అధిక సంఖ్యలో చనిపోతాయి. నాలుగు పీపీఎం కన్నా తక్కువైతే చేపలు చనిపోకపోయినప్పటికీ, ఒత్తిడికి గురై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి, మేత సరిగా తినకుండా పెరుగుదల మందగిస్తుంది.
చనిపోయిన ప్లాంక్టాన్ నీటి అడుగు భాగానికి చేరి కుళ్లడం ద్వారా కూడా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. ఈ కుళ్ళడం ద్వారా వెలువడే విషవాయువుల వల్ల కూడా నీటి గుణాలు త్వరగా పాడవుతాయి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో, ప్లాంక్టాన్ కుళ్ళడం వల్ల అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు ఎక్కువగా విడుదలయ్యి చేపలు చనిపోవడానికి కారణమవుతాయి.
చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. నీటి నాణ్యత పర్యవేక్షణ: వర్షాలు కురిసే సమయంలో చెరువులోని నీటి నాణ్యతను, పీహెచ్ స్థాయిని, ఆక్సిజన్ పరిమాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
2. ఆక్సిజన్ స్థాయిల పెంపు: నీటిలో ఆక్సిజన్ లోపం ఏర్పడినప్పుడు చెరువుల్లోకి కొత్త నీటిని తోడుకోవాలి. మోటార్ సెట్లను బిగించి చెరువు నీటిని తిరగదోడటం ద్వారా ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఆక్సిజన్ పరిమాణం పూర్తిగా తగ్గినట్లయితే, కాల్షియం పెరాక్సైడ్ (ఎకరాకు ఒక కేజీ చొప్పున) లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ (ఎకరాకు ఒక లీటరు చొప్పున) వంటి మందులను తాత్కాలికంగా వాడి ఆక్సిజన్ స్థాయిలను పెంచవచ్చు.
3. పీహెచ్ నియంత్రణ: వర్షపు నీటి పీహెచ్ విలువ ఆరు కన్నా తక్కువగా ఉంటుంది. అధిక వర్షపాతం పడినప్పుడు చెరువు నీటి పీహెచ్ ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వర్షం పడిన మరుసటి రోజు ఉదయం ఎకరాకు 10 నుండి 20 కేజీల చొప్పున వ్యవసాయ సున్నాన్ని వాడటం ద్వారా పీహెచ్ విలువలను సరిచేసుకోవచ్చు. ఇది చేపలపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, నీటిలో ఉన్న హానికారక వాయువు అయిన కార్బన్ డయాక్సైడ్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.
4. విషవాయువుల నియంత్రణ: చెరువు అడుగు భాగంలో పేరుకుపోయే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి అడుగు భాగంలో నీటి మార్పిడిని చేసుకోవాలి. అలాగే, ఎకరాకు 10 నుండి 15 కేజీల చొప్పున జియోలైట్ ను ఇసుకతో కలిపి చెరువులో వాడటం వల్ల అమోనియా విషవాయువు ప్రభావాన్ని తగ్గించవచ్చు. మార్కెట్లో లభించే యుక్కా సంబంధిత ఉత్పత్తులను వాడి అమ్మోనియా, నైట్రేట్ వంటి వాయువుల విష ప్రభావాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
ఈ విధంగా వర్షాకాలంలో ఏర్పడే వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ, చెరువు నీటి గుణాలను పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకోవడం ద్వారా చేపల పెరుగుదలను మెరుగుపరచి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
