అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. షట్‌డౌన్ vs రీస్టార్ట్ మధ్య ఇంత పెద్ద తేడా ఉందా..?
మీరు రోజూ కంప్యూటర్ పని అయిపోయాక షట్‌డౌన్ చేస్తున్నారా? లేక ఏదైనా సమస్య వస్తేనే రీస్టార్ట్ కొడుతున్నారా? అయితే మీకోనిజం తెలుసా.. మీరు షట్‌డౌన్ చేసినప్పుడు మీ కంప్యూటర్ నిజానికి పూర్తిగా ఆఫ్ అవ్వదు. మరి రీస్టార్ట్ చేసినప్పుడు సిస్టమ్ ఎందుకు కాస్త ఆలస్యంగా ఆన్ అవుతుంది? మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవ్వకుండా స్పీడ్‌గా పనిచేయాలంటే ఈ రెండింటిలో దేనిని ఎప్పుడు వాడాలో తప్పక తెలుసుకోవాలి.

ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వాడేవారికి షట్‌డౌన్, రీస్టార్ట్ అనేవి నిత్యం కనిపించే సాధారణ ఆప్షన్లు. పని ముగిశాక సిస్టమ్‌ను ఆఫ్ చేయడానికి షట్‌డౌన్ నొక్కుతాం.. సిస్టమ్ ఆఫ్ అయి మళ్లీ ఆన్ కావాలంటే రీస్టార్ట్ క్లిక్ చేస్తాం. అయితే పైకి ఈ రెండూ దాదాపు ఒకేలా అనిపించినా, విండోస్ 8, 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వీటి పనితీరులో ఊహించని సాంకేతిక వ్యత్యాసం ఉంది. కంప్యూటర్ పూర్తిగా ఫ్రెష్‌గా స్టార్ట్ కావాలంటే షట్‌డౌన్ కాకుండా రీస్టార్ట్ ఎందుకు చేయాలో తెలుసా? అసలు వీటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం.
షట్‌డౌన్ నిజంగా సిస్టమ్‌ను పూర్తిగా ఆపేస్తుందా?
చాలామంది భావించేలా విండోస్ ఆధునిక వెర్షన్లలో షట్‌డౌన్ చేసినప్పుడు కంప్యూటర్ పూర్తిగా స్విచ్ఛాఫ్ అవ్వదు. విండోస్ ఓఎస్‌లలో ఫాస్ట్ స్టార్టప్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. మీరు షట్‌డౌన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఓపెన్ చేసి ఉంచిన యాప్స్, బ్రౌజర్లు, వర్కింగ్ ఫైల్స్ క్లోజ్ అవుతాయి. కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అత్యంత కీలకమైన భాగమైన విండోస్ కెర్నల్ మాత్రం పూర్తిగా ఆఫ్ అవ్వదు. విండోస్ కెర్నల్ స్థితిని అలాగే ఒక హైబర్నేషన్ ఫైల్ రూపంలో హార్డ్‌డిస్క్‌లో భద్రపరుస్తుంది. తర్వాత మీరు పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు సిస్టమ్ మొత్తం ఓఎస్‌ను మొదటి నుంచి లోడ్ చేయాల్సిన పనిలేకుండా, సేవ్ అయిన ఫైల్ నుంచి క్షణాల్లో బూట్ అయిపోతుంది. తక్కువ సమయంలోనే కంప్యూటర్ స్క్రీన్ మీ ముందుకు రావడానికి ఈ టెక్నిక్కే కారణం.
రీస్టార్ట్ ఎలా పనిచేస్తుంది?
రీస్టార్ట్ అనేది విండోస్ సిస్టమ్‌ను మూలాల నుంచి సరికొత్తగా స్టార్ట్ చేసే ప్రక్రియ. రీస్టార్ట్ ఆప్షన్ నొక్కినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అన్ని ప్రాసెస్‌లు, తాత్కాలిక క్యాష్ డేటా, యాప్స్‌తో పాటు ప్రధాన విండోస్ కెర్నల్ కూడా పూర్తిగా షట్‌డౌన్ అవుతాయి. సిస్టమ్ తిరిగి ఆన్ అయ్యేటప్పుడు రామ్ పూర్తిగా క్లియర్ అయ్యి, కెర్నల్‌తో సహా అన్ని డ్రైవర్లు, ఫైల్స్ మొదటి నుంచి తాజాగా లోడ్ అవుతాయి. అందుకే షట్‌డౌన్ తర్వాత ఆన్ అవ్వడంతో పోలిస్తే రీస్టార్ట్ తర్వాత సిస్టమ్ బూట్ కావడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది.
దేనిని ఎప్పుడు ఉపయోగించాలి?
ఈ రెండింటి ప్రయోజనాలు వేర్వేరు సందర్భాలకు ఉపయోగపడతాయి.
షట్‌డౌన్ ఎప్పుడు చేయాలి?: రోజువారీ పనులు పూర్తయ్యాక రాత్రి పూట లేదా ప్రయాణాల్లో పీసీని ఆఫ్ చేయాలనుకున్నప్పుడు షట్‌డౌన్ బెస్ట్ ఆప్షన్. మరుసటి రోజు మీరు ఆన్ చేసినప్పుడు సిస్టమ్ శరవేగంగా ఆన్ అవుతుంది.
రీస్టార్ట్ ఎప్పుడు చేయాలి?
కంప్యూటర్ అకస్మాత్తుగా హ్యాంగ్ అయినా, స్లో అయినా లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్ ఎర్రర్ వచ్చినప్పుడు రీస్టార్ట్ చేయాలి. ఏదైనా కొత్త సాఫ్ట్‌వేర్, గేమ్స్, లేదా విండోస్ సిస్టమ్ అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు పాత క్యాష్ క్లియర్ అయి కొత్త ఫైల్స్ సరిగ్గా అమలు కావడానికి రీస్టార్ట్ మాత్రమే సరైన ఎంపిక.
కంప్యూటర్ పనితీరు ఎప్పటికప్పుడు వేగంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలంటే వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు సిస్టమ్‌ను రీస్టార్ట్ చేయడం ఉత్తమమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
