AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి మానవ నివాస చరిత్రను మార్చే..10,500 ఏళ్ల నాటి కలప లభ్యం

జర్మనీలోని ఓ సరస్సులో బయటపడిన 10,500 ఏళ్ల నాటి కలప అవశేషాలు పురాతన మానవ సమాజాలపై శాస్త్రవేత్తల అంచనాలను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కలప అవశేషాలు అప్పట్లోనే మనుషులు శాశ్వత నివాసాలను నిర్మించుకున్నారనే కొత్త ఆధారాలను అందిస్తున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జర్మనీలోని 'లేక్ అరెండ్‌సీ'లో పురావస్తు పరిశోధకులు వేల సంవత్సరాల నాటి చెక్క అవశేషాలను గుర్తించారు. వీటిలో కొన్ని దాదాపు 10,500 సంవత్సరాల క్రితం నాటివిగా గుర్తించారు.

తొలి మానవ నివాస చరిత్రను మార్చే..10,500 ఏళ్ల నాటి కలప లభ్యం
10500 Year Old Wood Under German Lake Could Alter History Of First Human Homes
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 5:03 PM

Share

ఈ కలప అవశేషాలు అప్పటి వేటగాళ్లు, ఆహార సేకరణపై ఆధారపడిన ప్రజల జీవన విధానంపై కొత్త విషయాలను వెల్లడించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. లేక్ అరెండ్‌సీలో దాదాపు 65 అడుగుల లోతులో పలుచటి మట్టి పొర కింద ఈ కలప అవశేషాలు బయటపడ్డాయి. నీటిలోని అవశేషాల కింద కప్పి ఉండటంతో అవి ఇన్ని వేల సంవత్సరాలు సంరక్షణలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధకులు గుర్తించిన వాటిలో 5 అడుగులకు పైగా పొడవున్న ఒక చెక్క స్తంభం ఉంది. దానిపై చెట్టును నరికినప్పుడు ఏర్పడినట్లు కనిపించే గుర్తులు ఉన్నాయి. అలాగే 4.3 అడుగుల వరకు పొడవున్న పలకలు కూడా లభించాయి. సాధారణంగా ఈ కాలానికి చెందిన పురావస్తు ప్రదేశాల్లో రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు వంటి ఆధారాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కలప చాలా అరుదుగా వేల సంవత్సరాలు నిలిచి ఉంటుంది. అందుకే ఈ ఆవిష్కరణ ప్రత్యేకమైనదిగా పరిశోధకులు భావిస్తున్నారు.

శాశ్వత ఇళ్లు అప్పుడే ఉన్నాయా?

జర్మనీలోని సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర వారసత్వ నిర్వహణ, పురావస్తు కార్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ కలపను పరిశీలిస్తున్నారు. దీనిని అప్పటి మనుషులు ఉపయోగించి ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కలపపై కనిపిస్తున్న నరికిన గుర్తులు, పలకల ఆకారం చూస్తే అవి సహజంగా విరిగిపోయిన చెక్క ముక్కలు కాకపోవచ్చని అనుమానిస్తున్నారు. మనుషులు వాటిని ప్రత్యేకంగా తయారు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అదే నిజమైతే.. ఆ కలప గుడిసెలు లేదా ఇతర నిర్మాణాల్లో భాగంగా ఉపయోగించి ఉండవచ్చని అంచనా.

చరిత్రలో 3 వేల ఏళ్ల మార్పు?

ఈ ఆవిష్కరణ నిర్ధారణ అయితే మానవ నివాసాల చరిత్రలో కీలకమైన మార్పు రావచ్చు. మధ్య యూరప్‌లో శాశ్వత నివాసాలు, వ్యవసాయ ఆధారిత సాంస్కృతిక ప్రాంతాలు మొదట నియోలిథిక్ కాలానికి చెందిన రైతులు ఏర్పరిచారని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. క్రీ.పూ. 5,500 ప్రాంతంలో మొదటి రైతులు ఈ ప్రాంతానికి వచ్చారని చరిత్ర చెబుతోంది. కానీ లేక్ అరెండ్‌సీలో లభించిన కలప నిజంగా శాశ్వత నిర్మాణాలకు చెందినదైతే.. వాటి కాలం 10,500 సంవత్సరాల క్రితం నాటిదిగా ఉండొచ్చు. అంటే మధ్య యూరప్‌లో రైతులు రాకముందే దాదాపు 3,000 సంవత్సరాల ముందే మనుషులు శాశ్వత నిర్మాణాలు లేదా ఎక్కువ కాలం ఉపయోగించే నివాస ప్రాంతాలను ఏర్పరుచుకుని ఉండే అవకాశం ఉంది.

వేటగాళ్ల జీవనంపై కొత్త అవగాహన

ఈ కాలాన్ని ‘మెసోలిథిక్ కాలం’గా పిలుస్తారు. ఇది పురాతన రాతియుగం, కొత్త రాతియుగం మధ్య మార్పు దశ. ఈ సమయంలో ప్రజలు ప్రధానంగా వేట, చేపలు పట్టడం, ఆహార సేకరణపై ఆధారపడేవారు. చిన్న సమూహాలుగా జీవించడం, ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండటం వంటి మార్పులు క్రమంగా చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు మధ్య జర్మనీలో ఈ కాలానికి చెందిన నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు చాలా తక్కువ. నేలపై కనిపించే కొన్ని గుర్తుల ఆధారంగానే నిర్మాణాల గురించి అంచనా వేయాల్సి వచ్చేది. అయితే సరస్సు అడుగున లభించిన ఈ చెక్క అవశేషాలు ఆ కాలం ప్రజలు .. నిర్మాణాలను తయారు చేసుకునే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నారా?, ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం నివసించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు.

మానవ చరిత్రపై ప్రభావం ఎంత?

10,500 ఏళ్ల క్రితమే శాశ్వత భవనాలు లేదా ఎక్కువగా ఉపయోగించే నివాస ప్రాంతాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే.. వేటగాళ్లు, ఆహార సేకరణపై ఆధారపడిన ప్రజల గురించి ఇప్పటివరకు ఉన్న అవగాహన మారే అవకాశం ఉంది. అంతేకాదు, మనుషులు ప్రకృతిని మార్చుకుంటూ ప్రత్యేకమైన నివాస ప్రాంతాలను, సాంస్కృతిక భూభాగాలను ఎప్పుడు ఏర్పరచడం ప్రారంభించారనే ప్రశ్నకు కూడా ఈ పరిశోధన కొత్త సమాధానాలను ఇవ్వవచ్చు. 10,500 ఏళ్ల క్రితం మధ్య యూరప్‌లో మనుషులు ఎలా జీవించేవారు? వారు ఎక్కడ నివసించేవారు? ఎంతకాలం ఒకే ప్రాంతంలో ఉండేవారు? అనే విషయాలపై మానవ చరిత్రకు కొత్త అధ్యాయం తెరుచుకునే అవకాశం ఉంది.

Follow Us