AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భస్థ శిశువుకు ట్యూమర్.. కణితికి సూదితోనే చికిత్స.. చైనా వైద్యుల అద్భుతం!

తల్లి గర్భంలో ఉన్న శిశువు ఛాతీలో కణితిని గుర్తించిన చైనాలోని వైద్యులు అద్భుతం చేసారు. క్రమంగా పెరుగుతూ గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతూ ప్రాణాపాయంగా మారింది. మరో వైపు కడుపులో ద్రవం కూడా చేరింది. వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తల్లి కడుపు నుంచి సూది ద్వారా నేరుగా గర్భంలోని శిశువు ఛాతీలోకి వెళ్లి.. ట్యూమర్‌ను లోపల నుంచే కాల్చేశారు.

గర్భస్థ శిశువుకు ట్యూమర్.. కణితికి సూదితోనే చికిత్స.. చైనా వైద్యుల అద్భుతం!
Chinese Doctors Shrink Lung Tumour For Baby Still In Mothers Womb Using Needle
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 2:46 PM

Share

40 ఏళ్ల మహిళ 22 వారాల గర్భవతిగా ఉన్న సమయంలో వైద్య పరీక్షల్లో ఆమె గర్భంలోని శిశువుకు మైక్రోసిస్టిక్ కాంజెనైటల్ పల్మనరీ ఎయిర్‌వే మాల్‌ఫార్మేషన్ (CPAM) ఉన్నట్లు గుర్తించారు. ఇది క్యాన్సర్ ట్యూమర్ కాదు కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల కణజాలం అసాధారణంగా వేగంగా పెరిగి భారీగా మారుతుంది. ఈ శిశువు విషయంలో అదే జరిగింది. స్కాన్లలో 5 సెంటీమీటర్ల పెరుగుదల శిశువు కుడి ఛాతీ భాగాన్ని ఆక్రమించినట్లు తేలింది. దీంతో గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడింది. అప్పటికే శిశువు పొత్తికడుపులో కూడా ద్రవం చేరడం ప్రారంభమైంది. ఇది గర్భంలోని శిశువుకు ప్రాణాపాయ పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ట్యూమర్‌లో పేరుకున్న ద్రవాన్ని బయటకు తీయడం లేదా దానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాన్ని మూసివేయడం లాంటి చికిత్సలను పరిశీలిస్తారు. కానీ ఈ శిశువు విషయంలో సమస్య మరింత క్లిష్టంగా ఉంది. ట్యూమర్‌ చిన్న చిన్న సిస్టులతో ఏర్పడి ఉండటంతో పాటు, దానికి ప్రత్యేకంగా కనిపించే ప్రధాన రక్తనాళం కూడా లేదు. దీంతో వైద్యులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు.

తల్లి కడుపు నుంచి.. నేరుగా శిశువు ఛాతీలోకి సూది!

షెన్‌జెన్ బావాన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ వైద్యులు కలిసి ఈ శస్త్రచికిత్స చేసారు. హై-డెఫినిషన్, రియల్‌టైమ్ అల్ట్రాసౌండ్‌ను ఉపయోగిస్తూ ముందుగా సూది వెళ్లాల్సిన మార్గాన్ని కచ్చితంగా గుర్తించారు. ఒక సన్నని ప్రత్యేక అబ్లేషన్ సూదిని తల్లి పొత్తికడుపు నుంచి లోపలికి పంపారు. అది గర్భాశయ గోడను దాటి.. చివరకు శిశువు ఛాతీ గోడను దాటి.. నేరుగా ట్యూమర్ మధ్యభాగానికి చేరింది. ఇక్కడే ఈ చికిత్సలో అత్యంత కీలకమైన దశ మొదలైంది. వైద్యులు మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీని ఉపయోగించారు. ట్యూమర్‌ను బయట నుంచి తొలగించకుండా, లోపల నుంచే వేడిని ఉత్పత్తి చేసి నాశనం చేశారు. ట్యూమర్ మాత్రమే దెబ్బతినాలి. దాని చుట్టూ ఉన్న శిశువు ఆరోగ్యకరమైన అవయవాలకు ఎలాంటి నష్టం జరగకూడదు. ఈ సవాలును వైద్యులు అధిగమించారు.

కేవలం రెండు నిమిషాల్లో కీలక ప్రక్రియ

ఈ యాక్టివ్ హీటింగ్ ప్రక్రియ రెండు నిమిషాల్లోనే పూర్తయింది. మూడు రోజుల తర్వాత పరీక్షలో ట్యూమర్ పరిమాణం తగ్గినట్లు గుర్తించారు. అంతేకాదు.. శిశువు పొత్తికడుపులో చేరిన ద్రవం కూడా మాయమైంది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న శిశువు పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. చికిత్స తర్వాత నాలుగు నెలల వరకు శిశువును వైద్యులు పరిశీలించారు. మరో శస్త్రచికిత్స అవసరం కాకుండానే చివరకు 37 వారాలకు శిశువు ఆరోగ్యంగా జన్మించాడు.

Follow Us